తిరుమలలో దళారులు రోజు రోజుకూ కొత్తరకాల మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తులకు తితిదే ఛైర్మన్ కార్యాలయం నుంచి అంటూ నఖిలీ సిఫార్సు సందేశాలను పంపి మోసగించారు. 11 మంది భక్తులకు దర్శనం కల్పిస్తామని... 16వేల రూపాయలకు ఒప్పందం చేస్తున్నారు. దళరుల మాటలు నమ్మిన భక్తులు తొలుత 8వేల రూపాయలు ఫోన్ పే చేశారు. దళారులు పంపిన సిఫార్సు సందేశంతో ఛైర్మన్ కార్యాలయానికి చేరుకున్న భక్తులు తితిదే సిబ్బందిని సంప్రదించగా నఖిలీ సిఫార్సు సందేశంగా తేలింది. మోసపోయామని గుర్తించిన భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: TTD: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు