వారంతా సరిహద్దుల్లో దేశరక్షణకు విధులు నిర్వహించిన మాజీ సైనికులు. జవానుగా పదవీవిరమణ చేశాక...తెలిసిన పని చేసేందుకే మొగ్గుచూపారు. ఒప్పంద కార్మికులుగా తితిదే భద్రతా విభాగంలో విధుల్లో చేరారు. కొందరికి ఆ నెల పని చేస్తే గానీ కుటుంబం నడవని దుస్థితి..! అలాంటిది 4 నెలలుగా విధులు నిర్వహిస్తున్నా జీతాలు రాకపోతే తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారుమాజీ సైనికులు.
ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్(ఏడబ్యూపీవో) ద్వారా 310 మంది మాజీ సైనికోద్యోగులను తితిదే భద్రతా విభాగంలో విధుల కోసం నియమించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించిన ఏడబ్యూపీవో.... ఎంపికైన వారిని ప్రీమియర్ షీల్డ్ అనే సంస్థ ద్వారా తితిదేకు కేటాయించింది. మార్చి ఒకటిన విధుల్లో చేరిన మాజీ సైనికులు... 4 నెలలుగా తితిదేలోని విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పరిపాలనా భవనం, అలిపిరి టోల్‌గేట్, స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులు సహా తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలోనూ విధులు నిర్వహిస్తున్నారు. ఐతే.... విధుల్లో చేరాక తొలి 20 రోజుల జీతం మాత్రమే చెల్లించారని మాజీ సైనికులు తెలిపారు.
జీతాలు చెల్లించే అంశంపై తితిదే సహా...ఏడబ్యూపీవో, ప్రీమియర్ షీల్డ్ సంస్థలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో క్లిష్టపరిస్థితుల్లోనూ విధులు నిర్వహించిన తమకు ఇక్కడ జీతాలు రాబట్టడం మాత్రం కష్టంగా ఉందని అంటున్నారు. మరోవైపు తితిదే నుంచిఏడబ్యూపీవో ద్వారా ఈఎస్ఐ చెల్లింపుల్లో సమస్యల వల్లే జీతాల జాప్యానికి కారణమవుతోందని..... మాజీ సైనికుల ఇంఛార్జి ప్రసాద్ తెలిపారు. కరోనా ప్రభావంతో ఈఎస్ఐ అధికారుల నుంచి స్పందన కొరవడిందని వివరించారు.
ఇదీ చదవండి: