తిరుపతి ఉపఎన్నికల నామినేషన్లు, పరిశీలన ఘట్టం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. అత్యధిక మెజారిటీ సాధనే లక్ష్యంగా అధికార వైకాపా తన ప్రచారాన్ని సాగిస్తుండగా.. ప్రతిపక్ష తెదేపా, భాజపాలు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో గూడూరు, సత్యవేడు, సూళ్లూరుపేటలు ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాలు కాగా.. మిగిలినవి జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
సామాజికవర్గాల వారీగా...
ఏడు శాసనసభ స్థానాల పరిధిలో సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను అంచనా వేసిన పార్టీల నేతలు.. వారిని ఆకర్షించేందుకు వీలుగా కార్యక్రమాలు చేపట్టారు. ప్రముఖ నేతల ప్రచారాలు, చిన్నపాటి సమావేశాలు సైతం సామాజికవర్గాల కోణంలో రూపొందించారు. వెనకబడిన వర్గాల ఓటర్లలో పట్టున్న తెదేపా ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలపై దృష్టి సారించింది.
ఆ ఓట్లు మాకే...
తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో అధిక ఓట్లు ఉన్న ఓ సామాజికవర్గ నేతలతో తెదేపా ప్రచారాన్ని చేపట్టింది. ఎస్సీ రిజర్వుడ్ స్థానాలైన శాసనసభ నియోజకవర్గాల్లో ఆ వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో వెనకబడిన వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో బేరీజు వేసుకుంటున్నారని.. ఆయా వర్గాల ఓట్లు తమకేనన్న ధీమాను తెదేపా నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తీర ప్రాంతాల్లో తిష్ట...
భాజపా సైతం ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ మార్గాలను అనుసరిస్తోంది. తిరుపతిలో ఓ సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటంతో సంబంధిత వర్గ నేతలు, ఓటర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు శాసనసభ నియోజకవర్గాలోని తీర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉండటంతో ఆ వర్గానికి చెందిన నేతలను ప్రచారానికి తీసుకువస్తున్నారు.
వైకాపా ఆత్మీయ సమ్మేళనాలు...
అధికార వైకాపా తెదేపా, భాజపా నేతలను మించి ప్రచారాన్ని చేపట్టింది. సామాజిక వర్గాల వారీగా నేతలను నియోజకవర్గాల ఇంఛార్జ్లుగా నియమించింది. ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో దళితుల సొంత పార్టీ వైకాపా అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామంటూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
తాము అధికారంలో ఉన్నపుడు ఆయా సామాజిక వర్గాలకు చేపట్టిన పనులను తెదేపా వివరిస్తుండగా... తిరుపతిలో విజయం సాధిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో భాజపా హామీ ఇస్తోంది. అధికార వైకాపా ఆయా సామాజిక వర్గాలకు మరే రాజకీయ పార్టీ ఇవ్వనంత గుర్తింపు తాము ఇస్తున్నామంటూ ఓట్లు అడుగుతున్నారు.
ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎస్ఈసీ ఆరా