చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన 49 సంవత్సరాల ఓ వ్యక్తి దగ్గు, ఆయాసంతో తిరుపతి రూయా ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అదే రోజు బాధితుణ్ని కొవిడ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. బాధితుడు రెండు, మూడు రోజులు కుటుంబ సభ్యులతో చరవాణిలో మాట్లాడారు. ఆదివారం నుంచి చరవాణి స్విచ్చాఫ్ కావడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చివరకు ఆస్పత్రి అధికారులను సంప్రదించగా.. మంగళవారం ఉదయం రోగి చనిపోయాడని సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో భార్య, పిల్లలు చివరి చూపు కోసం ఆస్పత్రి వద్దకు వచ్చారు. అయితే మృతదేహం శవాలగదిలో కనిపించకపోవడం గందరగోళానికి దారి తీసింది. విషయాన్ని నోడల్ అధికారి డాక్టర్ సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సిబ్బందితో కలిసి పూర్తిస్థాయిలో పరిశీలించగా.. సదరు కరోనా బాధితుడు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్లుగా తేలింది. పక్కనే ఉన్న మరో రోగి మరణించాడని.. ఆయనే తప్పిపోయిన వ్యక్తిగా భావించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు వైద్యులు తేల్చారు. అయితే కనిపించకుండా పోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్లాడో తేల్చాలని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆర్ఎంకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి..