ఆపద మొక్కులవాడు, వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారి దివ్యమంగళ రూపం క్షణకాల దర్శనానికి భక్తులు తపించిపోతుంటారు. దర్శన టికెట్ దొరికితే జన్మధన్యమైందన్న భావనతో తిరుమల యాత్రకు తరలివస్తారు. అయితే కరోనా వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన భక్తులు.. సర్వదర్శనం కోసం తిరుపతిలో టికెట్లు పొందిన వారు తిరుమల యాత్రను రద్దు చేసుకుంటున్నారు. రోజూ దాదాపు 12వేల మందికి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది తితిదే యంత్రాంగం. అయినప్పటికీ స్వామిని దర్శించుకునేవారి సంఖ్య 10వేలు దాటడం లేదు.
గత వారం రోజులుగా శ్రీవారి దర్శనాలకు తితిదే జారీ చేసిన టికెట్లు... శ్రీవారిని దర్శించుకొన్న భక్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
తేది తితిదే జారీచేసిన టికెట్లు.. దర్శించుకున్న భక్తులు
జులై-3 12,000 9,841
జులై-4 12,000 11,978
జులై-5 12,000 10,415
జులై-6 12,000 10,983
జులై-7 12,000 10,498
జులై-8 12,000 10,109
జులై-9 12,000 9,852
జులై-10 12,000 8,115
కరోనా ప్రభావంతో మార్చి 20న సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేసిన తితిదే.. జూన్ 8 నుంచి తిరిగి దర్శనాలను ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా కొద్ది రోజులు 6 వేల మందికి దర్శన భాగ్యం కల్పించిన తితిదే క్రమంగా దర్శన టికెట్లను 12 వేలకు పెంచింది. దాదాపు 3 నెలల తర్వాత శ్రీవారిని దర్శించుకొనే అవకాశం రావటంతో సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన 8 కేంద్రాల్లో దర్శన టికెట్ల కోసం అర్ధరాత్రి నుంచే బారులు తీరిన భక్తులు టికెట్లు దక్కించుకొన్నారు. రోజుకు 3 వేల టికెట్లు మాత్రమే జారీ చేస్తుండగా వేల మంది వరుసల్లో నిల్చునేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సర్వదర్శనం కోసం రోజుకు జారీచేసే 3 వేల టికెట్లలో రోజుకు 800 వరకు మిగిలిపోతున్నాయి.
శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు సగటున రోజుకు 1500ల నుంచి 2 వేల వరకు తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం.. కంటైన్మెంట్ జోన్ల పరిధి పెరగటంతో టికెట్లు బుక్ చేసుకున్నా భక్తులు రావడం లేదన్న అభిప్రాయం తితిదే అధికారుల్లో వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి...