తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సప్తగిరి మాస పత్రిక ఏప్రిల్ ఎడిషన్‌లో రామాయణానికి సంబంధించిన ఓ కథ ప్రచురితమైంది. 'కుశుడు' అనే పేరుతో వేసిన ఆ కథనం కాస్త విమర్శలకు దారి తీస్తోంది. రామాయణానికి వక్రభాష్యం చెప్పడం దారుణమంటూ భాజపా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస పరిశీలన చేయకుండా ఎలా ప్రచురిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఇలా తెరపైకి వచ్చీ రాగానే... తితిదే వెబ్సైట్లో సప్తగిరి ఏప్రిల్ ఎడిషన్ కనిపించకుండా పోయింది.
అసలు కథేంటి....?
కుశునిపై జానపదులు చెప్పే కథల్లో భాగంగా ఏప్రిల్ మాసపత్రికలో కథనాన్ని ప్రచురించారు. ఇందులో రాముడు - సీత దంపతులకు లవుడు ఒక్కరే జన్మించారని... కుశుడు పుట్టలేదన్నది సారాంశం. వాల్మీకి తన మంత్ర శక్తితో కుశుడిని సృష్టించారని రాశారు. కుశుడు.. రాముడు- సీతలకు జన్మించకపోయినప్పటికీ లవునికి కవల సోదరునిగా మనన్నలను పొందాడంటూ పేర్కొన్నారు.
విమర్శలెందుకు...?
రామాయణ, లవ-కుశల చరిత్రలపై అసత్య కథనాన్ని ఎలా ప్రచురిస్తారని భాజపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓ విద్యార్థి రాసిన కథను కనీసం పరిశీలించకుండా ఎలా ప్రచురిస్తారని ఆందోళనకు దిగారు. ఇందుకు కారణమైన సప్తగిరి ఎడిటర్‌తో పాటు.. సంబంధిత ఉద్యోగులను తొలగించాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఇదీ చదవండి:'రామాయణాన్ని వక్రీకరించారు... ఎడిటర్‌ను తొలగించండి'
వెబ్సైట్లో మాయం..!
మాస పత్రికలోని కథనం వివాదం కావటంతో తితిదే చర్యలు చేపట్టింది. సప్తగిరి వెబ్సైట్లో మిగతా మాసాల పత్రికలను అందుబాటులో ఉంచి...ఏప్రిల్ మాసపత్రికను మాత్రం తొలగించింది. ఈ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల నుంచి ఎలాంటి వివరణ రాలేదు.
ఇదీ చదవండి: