తిరుమల కొండపై రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 140 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ అంశం ఇప్పుడు కొండపై కాకరేపుతోంది. రమణ దీక్షితులు వర్సెస్ పాలకమండలి అన్నట్టు సాగుతోందీ వివాదం.
అసలేం జరిగిందంటే...
కొండపై కరోనా వేగంగా విస్తరిస్తుందని ట్వీట్ చేసిన తితిదే ఆగమ సలహాదారు రమణదీక్షితులు... ఆ ట్వీట్‌ను సీఎం జగన్‌కు ట్యాగ్ చేశారు. 50 మంది అర్చకుల్లో 15 మందికి వ్యాధి సోకిందని తెలిపారు. ఇంకా 25 మంది అర్చకుల నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. దర్శనాలు నిలిపివేస్తే మంచిదని... దీనికి తితిదే ఈవో, అడిషనల్ ఈవో అంగీకరించడం లేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా చంద్రబాబు అజెండాను ఈవో, అదనపు ఈవో అమలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఆపేయడం కుదరదు... తితిదే ఛైర్మన్ ఘాటు రిప్లై
రమణ దీక్షితుల ట్విట్టర్‌పై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. కరోనా అంశంపైనే చర్చించేందుకు అర్చకులతో సమీక్షించిన ఆయన... శ్రీవారి దర్శనాలు ఆపే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తితిదే ఉద్యోగులు 140 మందికి కరోనా నిర్ధరణ అయినట్టు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా బారిన పడిన వారిలో పోటు సిబ్బంది 16, అర్చకులు 14 మంది ఉన్నారని వివరించారు. 70 మందికే చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. మిగిలిన సిబ్బంది కోలుకున్నట్టు తెలిపారు.
సూచనలు ఉంటే పాలకమండలికి చెప్పాలి: వైవీ
ఈ అంశాలన్నింటినీ తిరుమలలో పనిచేసే అర్చకులతో చర్చించామని... వయసు పైబడిన అర్చకులకు విధుల కేటాయింపులో మినహాయింపు ఇచ్చామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విధుల్లో ఉన్న అర్చకులకు విడివిడిగా వసతి, భోజన వసతులు కల్పిస్తామని ప్రకటించారు. శ్రీవారి దర్శనాలు ఇప్పట్లో ఆపే ఆలోచన లేదని... రమణ దీక్షితుల సలహాని కొట్టిపారేశారు. రమణ దీక్షితులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. ఆయన ఆగమ సలహాదారుగానూ ఉన్నారని... సూచనలు చేయాలంటే తితిదేకి చెప్పాలని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. రమణ దీక్షితులను పిలిపించి మాట్లాడాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి ..