ఎంపీ దుర్గా ప్రసాద్ కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. తిరుపతి ఎంపీ పరిధిలో వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలతో నిన్న సమావేశమైన జగన్.. ఇవాళ దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్ కుమారుడు, కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరిని సీఎం వద్దకు తీసుకు వచ్చారు. తిరుపతి ఎంపీ స్థానానికి పోటీ చేసే విషయమై సీఎం జగన్..దుర్గాప్రసాద్ కుటుంబంతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయలేమని ముఖ్యమంత్రికి తెలిపినట్లు బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ చెప్పారన్నారు. ఉపఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించారు. రాజకీయంగా వారి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రి బొత్స తెలిపారు. తిరుపతి ఎంపీ అభ్యర్థిత్వానికి ఫిజియోథెరపిస్ట్ వైద్యుడు గురుమూర్తి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆయన పేరు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇవాలో, రేపో పార్టీ ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు