తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో అక్రమాలు నిలువరించాలంటూ కలెక్టర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. నకిలీ ఐడీ కార్డులతో దుండగులు అక్రమాలకు పాల్పడుతుంటే ప్రశ్నించిన వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపాయేతర అభ్యర్థులు, ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనకుండా పోలీసులు అక్రమ నిర్భంధాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అక్రమ నిర్బంధాలు జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1.20లక్షల మంది వాటాదారులు, రూ.350కోట్ల టర్నోవర్ ఉన్న తిరుపతి టౌన్ సహకార బ్యాంక్ నిధులను కాజేసేందుకు వైకాపా కుట్ర పన్నిందని చంద్రబాబు ఆరోపించారు. బ్యాంకుకు చెడ్డపేరు తెచ్చి, అస్థిరతకు గురిచేసేలా వైకాపా యోచిస్తోందని దుయ్యబట్టరు.
వైకాపా మద్దతుదారులను గెలిపించేందుకు తిరుపతిలోని ఓ వర్గం పోలీసులు.. అధికారపార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఇప్పటికే వైకాయేతర అభ్యర్థులపై పోలింగ్‌కు రెండురోజుల ముందు.. తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన వలముని అనే పోటీదారుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ఆస్తుల రక్షణ, బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు ఈరోజు పోలింగ్ ప్రక్రియను రద్దు చేసి.. రీపోలింగ్ నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: