తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజుల పాటు తిరుపతి ఉపఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఇవాళ తిరుమల చేరుకున్న చంద్రబాబు తిరుమలేశుడిని దర్శించుకున్నారు.
రమణదీక్షితుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చడం బాధాకరం. దేవుడు దేవుడే.. మనిషి మనిషే.. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై వ్యాఖ్యలు బాధాకరం. గతంలోనూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం సరికాదు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది- చంద్రబాబు
శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవులు, సంధ్యారాణి చంద్రబాబు వెంటఉన్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాలాజీనగర్‌లో స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లనున్న చంద్రబాబు.. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. బి.పి.అగ్రహారం, సూపర్ బజార్, పెళ్లి మండపం మీదుగా బేరివారి మండపం వరకు ప్రచారం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి శ్రీకాళహస్తి పార్టీ కార్యాలయం వద్దే బస్సులో బసచేస్తారు. 9వ తేదీన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, 10వ తేదీన సూళ్లూరుపేట, 11వ తేదీన వెంకటగిరి, 12న సత్యవేడు, 13న గూడూరు, 14వ తేదీన తిరుపతి లో జరిగే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఇదీ చదవండి: కరోనా టీకా రెండో డోసు తీసుకున్న మోదీ