Amaravathi farmers in Alipiri: అమరావతి 29 గ్రామాల రైతులది కాదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నియంత పాలన చేస్తున్న ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు. రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన జేఏసీ నాయకులకు వివిధ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. అలిపిరి గరుడ కూడలి వద్ద తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో వారిని సత్కరించి శ్రీవారి విగ్రహాన్ని బహూకరించారు. వారు అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టి తిరుమలకు కాలినడకన వెళ్లారు.
‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగిన మహాసంకల్ప పాదయాత్రలో రాష్ట్రానికి న్యాయం జరిగితే వస్తామని శ్రీవారిని ప్రార్థించామని జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి తెలిపారు. మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం’ అని వెల్లడించారు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందని, అక్కడ ఇచ్చే తీర్పుతోనైనా వారి నోళ్లు మూతపడతాయని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజధానికి సంబంధించి మంత్రులు అవాకులు చవాకులు పేలడం ఆపుతారన్నారు. జేఏసీ కోకన్వీనర్ తిరుపతిరావు మాట్లాడుతూ.. ‘న్యాయానికే న్యాయం జరిగింది. బలం ఉందని చట్టాలు చేయడానికి లేదు.. చేసిన చట్టాలను రద్దు చేసి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు. జగన్ ఇంకో 4సార్లు దుర్మార్గాలు చేసి గెలిచినా రాజధానిని మార్చలేరు’ అని అన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ, జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్, సీపీఎం, సీపీఐ నాయకులు రామానాయుడు, కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం వారు తిరుమలకు చేరుకున్నారు.
CPI Ramakrishna: అమరావతి ఉద్యమం కమ్యూనిస్టులతో కూడా కొబ్బరికాయలు కొట్టించిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా అమరావతిని రాజధానిగా కోరుతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు సీఎం జగన్‌కు మంచి అవకాశమని.. సమయం సరిపోకపోతే ధర్మాసనాన్ని అదనపు సమయం అడగాలని సూచించారు. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం కూడా సహకరించాలని రామకృష్ణ కోరారు.
ఇదీ చదవండి:
YV Subbareddy: శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్ల ధరలు పెంచే ఆలోచనే లేదు: వైవీ సుబ్బారెడ్డి