చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామ సమీపంలో పంప్‌హౌస్ వద్ద కరోనా మృతదేహాలను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించటంతో... రహదారిపై బైఠాయించారు. తిరుపతి రుయా, స్విమ్స్, పద్మావతి కొవిడ్ ఆసుపత్రుల్లో కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను పంప్‌హౌస్ వద్ద ఉన్న రెవెన్యూ స్థలంలో ఖననం చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో అధికారులు రాకుండా దారిపొడుగునా చెట్లు నరికివేశారు. తిరుమల తిరుపతికి ఇక్కడ నుంచి మంచినీరు సరఫరా అవుతుందనీ.. తమ పశువులు మేతకు ఇక్కడకే వస్తాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ అభ్యంతరం లేని చోట మృతదేహాలను ఖననం చేయాలని అధికారులను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మార్వో చిన్న వెంకటేశ్వర్లు, ఆర్డీవోకి సమస్య వివరించినట్లు తెలిపారు. గ్రామస్థుల అంగీకారం లేకుండా మృతదేహాలను ఖననం చేయమని అధికారులు హామీతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: విషాదం: తిరుపతిలో గోడకూలి వ్యక్తి మృతి