తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద నకిలీ ఓటర్లను గుర్తించడం కలకలం రేపింది. రిగ్గింగ్ సమాచారంతో విపక్ష తెలుగుదేశం, భాజపా, కాంగ్రెస్ నేతలే స్వయంగా రంగంలోకి దిగి... ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద లైన్లో నించున్న వారిని నిలదీశారు. అన్నారావు సర్కిల్ పోలింగ్ బూత్‌లో భాజపా నేత శాంతారెడ్డి... దొంగ ఓటర్ల భరతం పట్టారు. వేర్వేరు పేర్లతో ఓట్లు వేస్తున్న నకిలీలను పట్టుకున్న ఆమె అక్కడికక్కడే కడిగి పారేశారు.
గిరిపురం పోలింగ్ బూత్‌లో సాక్షాత్తు వైకాపా నాయకులే పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పంధ్యాల మడుగు ఉప సర్పంచ్ రామచంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాబు రెడ్డి, వైకాపా నేత జింకల శ్రీనివాసులును భాజపా నాయకురాలు శాంతారెడ్డి నిలువరించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాతే వారు వైకాపా నాయకులని బయటపడింది.
మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో పెద్దసంఖ్యలో స్థానికేతరులు ఉండటంపై తెలుగుదేశం నాయకులు ఆందోళనకు దిగారు. తిరుపతి తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పీఎల్‌ఆర్ ఎదుట ఆందోళనకు దిగారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుటే బస్సులో పెద్దసంఖ్యలో వచ్చిన స్థానికేతరులను తెదేపా నేత నరసింహయాదవ్ పట్టుకున్నారు. అక్కారంపల్లిలో తెదేపా నేత మబ్బు దేవనారాయణ రెడ్డి నకిలీలను అడ్డుకున్నారు.
డీపీఆర్ కల్యాణమండపం దగ్గర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్, తెదేపా నేతలతో కలిసి స్థానికేతరులు వస్తున్న వాహనాలను నిలిపేసి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మర్రిమంద పోలింగ్ కేంద్రంలో కొంతమంది వ్యక్తులు కార్లలో వచ్చి, చంపేస్తామని బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెదేపా ఏజెంట్లు నిర్వేదం వ్యక్తం చేశారు. దొంగఓట్ల ఆరోపణలకు సంబంధించి కొంతమందిపై కేసులు నమోదు చేశామన్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు... సమగ్రంగా విచారణ జరపాల్సి ఉందన్నారు. సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపిస్తామని చెప్పారు.
తిరుపతి ఉపఎన్నికలో 64.29 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కె.విజయానంద్ వెల్లడించారు. రాత్రి 7గంటల వరకూ క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించినందున తుది పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందన్నారు. గతంతో పోలిస్తే 15శాతానికి పైగా ఓటింగ్ శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఈవీఎంలను పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు.
ఇదీ చదవండీ... తిరుపతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం.. దండెత్తిన దొంగ ఓటర్లు..!