కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గిందని అనుకుంటున్న వేళ రాష్ట్రంలో వైరస్ మరోసారి తిరగబెట్టింది. పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ముందుగా చెప్పినట్లుగానే తిరిగి లాక్ డౌన్‌కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మూడు జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో పాక్షికంగా ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. కృష్ణా జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ..నిర్ణయాన్ని తిరిగి వెనక్కి తీసుకున్నారు. అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉండగా...శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ప్రకాశంలో ప్రస్తుత పరిస్థితి
ప్రకాశం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అంతకుమందుకు మూడు నుంచి ఐదు కేసులు నమోదు అయ్యేవి. కానీ ప్రస్తుతం 20నుంచి 30 కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 340 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఒక్క ఒంగోలులోనే ఇంతవరకూ 83 కేసులు ఉన్నాయి. చీరాలలో 48, పాజిటివ్ కేసులు, వేటపాలెంలో 16 కేసులు కందుకూరులో 22 కేసులు, టంగుటూరు మండలంలో 14 కనిగిరిలో 9 , మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు ఉన్నాయి. ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఆదివారం నుంచి 14 రోజులు పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించారు.. ఉదయం 10 గంటల వరకు కూరగాయలు, పాలు వంటి నిత్యవసరాల కోసం దుకాణాలు తెరుస్తున్నారు... జిల్లా వ్యాప్తంగా 47 కంటైన్మెంట్లు జోన్లుగా విభజించి ఎక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు.
'వ్యాపారంగా అస్తవ్యస్థంగా మారింది. దుకాణాలు తెరిచి 20 రోజులు పాటు కాకముందే మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారు. కొంత గాడిలో పడుతున్నామన్న వేళ ఇలాంటి నిర్ణయం ప్రకటించటం సరికాదు. మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లక తప్పేలా లేదు' - వ్యాపారులు
అనంతలో ఆగని కరోనా
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 1234 మందికి సోకింది. గతం వారం రోజులుగా కేసుల నమోదు ఎక్కువగా ఉంది. కేసులు ఎక్కవగా నమోదవుతున్న పలు ప్రాంతాల్లో మరోసారి లాక్ డౌన్ విధించారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 21 నుంచి ఆంక్షలు పెట్టారు. ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు వరకు మాత్రమే నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసిందని ఆనందపడిన చిన్న వ్యాపారులు, దుకాణదారులకు మళ్లీ లాక్ డౌన్ పిడుగుపాటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో
జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. లాక్ డౌన్ ఎత్తివేసిన నాటి నుంచి కేసులు పెరుగుతున్నాయి. సామాజిక వ్యాప్తి దిశగా మారకముందే పలు చోట్ల ఆంక్షలు విధిస్తున్నారు.
'లాక్ డౌన్ ఎత్తివేశాక కేసులు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సామాజిక వ్యాప్తి మొదలైంది. రాజాం, ఇచ్ఛాపురం, పలాస వంటి ప్రాంతాల్లో రాకపోకలను నిషేధించాం. ఎక్కువ కేసులు నమోదైతే లాక్ డౌన్ విధిస్తాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలే స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.'- జిల్లా కలెక్టర్
తూర్పులోనూ అదే పరిస్థితి
తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా అధికారులు జిల్లాలోని 80 కంటైన్మెంట్ జోన్లలో మళ్లీ లాక్డౌన్ విధించారు. కేంద్రపాలిత ప్రాంతం అయిన యానాం కనకాలపేటలో కరోనా పాజిటివ్ కేసు ఉండటంతో ఆ గ్రామాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి.. 14 రోజులపాటు అన్ని రకాల వ్యాపారాల సంస్థలు మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. తాళ్లరేవు మండలం వెంకటాయపాలెం, కాట్రేనికోన మండలం దొంతుకుర్రులో గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.
విజయనగరం జిల్లాలో
విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు 178 కేసులు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ జవహర్ లాల్ తెలిపారు. గ్రీన్ జోన్లో ఉన్న జిల్లాలో లాక్ డౌన్ తరువాత కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. నివారణ కార్యక్రమంలో భాగంగా... వైరస్ వ్యాప్తి నియంత్రణపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి:
కోర్టు తీర్పు అమలులో ప్రభుత్వ జాప్యం.. అధికారుల అలసత్వం: నిమ్మగడ్డ