ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 10,19,452 క్యూసెక్కుల వరద నీటిని విడిచిపెట్టారు.
ఈ కారణంగా బ్యారేజీకి దిగువనున్న కోనసీమలోని గౌతమి వశిష్ఠ వైనతేయ నదీ పాయలలో వరద నీరు పోటెత్తి ప్రవహిస్తోంది. చాకలి పాలెం సమీపంలో కాజ్వే వరద నీటి లో పూర్తిగా మునిగిపోవడంతో దానికి అవతల ఉన్న కనకాయలంక గ్రామ ప్రజలు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు. బూరుగు లంక, అరిగెల వారి పేట, ఊడిమూడి లంక, జి. పెదపూడి లంక, పెదమల్లలంక ,అయోధ్య లంక ,అనగారి లంక ప్రజలు గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
వరద ఉద్ధృతి పెరగడంతో ముంపు ప్రభావిత మండలాల అధికారులు అప్రమత్తం అయ్యారు. సహాయక చర్యల కోసం 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తులశాఖ హెచ్చరించింది. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించొద్దని కె.కన్నబాబు తెలిపారు.
ఇదీ చదవండి: FLOOD FLOW: ఉద్ధృతంగా గోదావరి..సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు