Marriages in Maghamasam: మాఘమాసం బుధవారం నుంచి ఆరంభమైంది. శూన్యమాసం తరువాత ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు సిద్ధం అవుతున్నారు. మరోపక్క మూడో దశ కరోనా ముప్పు ఉండటంతో నిబంధనలు తప్పక పాటించాల్సిన పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో వివాహాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఆహ్వానితుల సంఖ్య, భోజనాల ఏర్పాటు, వేదికలు, కల్యాణ మండపాల్లో కిక్కిరిసే పరిస్థితులపై అధికార యంత్రాంగం హెచ్చరికల మాటెలా ఉన్నా.. నిర్వాహకులు చైతన్యంతో, బాధ్యతగా భావించి తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
20 రోజులపాటు..
ఫిబ్రవరి 6, 7, 10, 11, 14, 17, 19 తేదీల్లో మంచి ముహుర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఇళ్లలో శుభకార్యాలకు నిర్ణయించారు. ఈ ముహూర్తాలు దాటితే మళ్లీ ఏప్రిల్‌లోనే మంచి రోజులుంటాయని పురోహితులు అంటుండటంతో త్వరపడుతున్నారు.
మన మంచికే..
ప్రభుత్వం నిర్దేశించిన కొవిడ్ నిబంధనలు అందరి మంచికేనని గుర్తించాలి. మాస్క్ ధారణ, భౌతికదూరం తప్పనిసరి. రెండు విడతల టీకా పొంది ఉంటే మంచిది. లక్షణాలున్న వారు శుభకార్యాలకు హాజరు కాకుండా స్వీయ నియంత్రణ పాటించాలి. అవకాశం ఉంటే.. పాజిటివిటీ తగ్గే వరకు పెళ్లిళ్లు తదితరాలను వాయిదా వేసుకుంటే బాగుంటుంది.- బి.మీనాక్షి, డీఎంహెచ్‌వో(ఎఫ్‌ఏసీ), కాకినాడ
జిల్లాలో ఇలా..
ఈ నెలలో జరగనున్న వివాహాలు: 10 వేలకుపైగానే..
తితిదే కల్యాణ మండపాలు: 15
ప్రైవేటు ఫంక్షన్ హాళ్లు: 250
ఇదీ చదవండి : Hanuman Land: ఈనె 16న తిరుమలలో హనుమాన్ జన్మస్థలానికి భూమిపూజ