తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరామనవమి ఏటా ఘనంగా నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా కోలాహలంగా జరిగే ఉత్సవాలకు భక్తులు దూరంగా ఉన్నారు. ఫలితంగా జిల్లాలోని ఆలయాలు వెలవెలబోతున్నాయి.
తాళాలు వేసిన ఆలయాలకే దండం
లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామనవమి పండగ కళ తప్పింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు పండగను సాధాసీదాగా జరుపుకున్నారు. జిల్లాలో ఎక్కడా సంబరాలు నిర్వహించలేదు. రాములవారి ఆలయాలన్నీ మూతపడటంతో ఒకరిద్దరు తాళాలు వేసిన ఆలయాలకే దండం పెట్టుకుని వెళ్లిపోయారు.
మూతపడిన ఆలయాలు
ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రతి గ్రామంలోనూ కొలువైన సీతారామస్వామి ఆలయాల వద్ద కల్యాణం సందడి లేనేలేదు. స్థానిక అధికారులు పోలీసులు హెచ్చరికలతో ఆలయాల వద్దకు భక్తులు రాకుండా గ్రామ కమిటీలు చర్యలు చేపట్టాయి. ఆలయాలలో ప్రధాన అర్చకులు మాత్రమే సీతారాముల కల్యాణం జరిపించారు.
కోనసీమలో శ్రీరామనవమి వేడుకలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో శ్రీరామనవమి వేడుకలు ఆలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ లాక్‌డౌన్ విధించటంతో కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సీతారామచంద్రస్వామి ఆలయంలోని అర్చకులు స్వామి అమ్మవార్లకి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ఆలయ కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
అన్నవరంలో ఘనంగా సీతారాముల కల్యాణం
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. క్షేత్ర పాలకులుగా కొలిచే సీతారాముల వారి కల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. పెళ్లి పెద్దలుగా సత్యదేవుడు, ఆనంతలక్ష్మి అమ్మవార్ల చెంతనే సీతారాముల వారిని ఆశీనులను చేసి అర్చకులు వేడుక నిర్వహించారు. కరోనా నేపథ్యంలో వేడుకకు భక్తులను ఎవరినీ అనుమతించలేదు.
శ్రీరామనవమి వేడుకలకు దూరంగా ఉన్న భక్తులు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో శ్రీరామనవమి వేడుకలకు భక్తులు దూరంగా ఉన్నారు. ఏటా మన్యంలో శ్రీరామనవమి వేడుకల్ని తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రంపచోడవరంలో జరిగే ఉత్సవాలకు భక్తులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలో ఉన్న పూజారి ఒక్కరే సీతారాముల కల్యాణం జరిపించారు.
ఇదీ చూడండి: