తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అనుబంధ కమిటీల నియామకం, జిల్లాలో స్థానిక నేతల తీరుపై కొంత కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అనుబంధ కమిటీల్లో నియామకానికి సంబంధించి ఇటీవల గోరంట్ల సిఫారసు చేసిన పేర్లకు అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఆయన్ను మరింత కలత చెందేలా చేసిందని సమాచారం.
ఇక పార్టీలో తాను పని చేయడం అనవసరమనే అభిప్రాయాన్ని గోరంట్ల సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి మాట్లాడారు.
బుచ్చయ్య ఇంటికి మాజీ మంత్రులు
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్ వెళ్లారు. గోరంట్ల పార్టీని వీడుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయనతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చినరాజప్ప..పార్టీ ఆవిర్భావం నుంచి గోరంట్ల తెదేపాలో కొనసాగుతున్నారన్నారు. గోరంట్ల చెప్పిన విషయాలను అధినేత చంద్రబాబుకు వివరిస్తామన్నారు. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని గోరంట్ల చెప్పినట్లు చినరాజప్ప వెల్లడించారు. తనను కొందరు గౌరవించటం లేదని గోరంట్ల అంటున్నారన్నారు. రాజీనామా చేస్తానని గోరంట్ల ఎప్పుడూ చెప్పలేదని..,సీనియర్ నేతగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఆయనకు తగిన గౌరవం ఉంటుందన్నారు.
బుచ్చయ్య స్పందన ఇదే..
మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్‌లతో చర్చల అనంతరం గోరంట్ల బుచ్చయ్య మీడియాతో మాట్లాడారు.
"స్థానికంగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నాకు సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నా సమస్యలపై చర్చించాల్సి ఉంది. పార్టీలో నేను ఒంటరివాడిని. నా నిర్ణయాన్ని త్వరలో బహిరంగంగా ప్రకటిస్తా" అని బుచ్చయ్య స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తెదేపాకు రాజీనామా వార్తలపై.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందన ఇదే..!