యావత్ దేశం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంపై విశ్వాసంతో ఉందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఉద్ఘాటించారు. వర్తమానం, భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో రాంమాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనీసం అధ్యక్షుడు కూడా లేని కాంగ్రెస్ పార్టీ నేతలు... మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీపై నమ్మకంతో భాజపాతో కలిసి పనిచేయడానికి అందరూ ముందుకు వస్తున్నారని చెప్పారు.
అవినీతి రహిత అభివృద్ధి నరేంద్రమోదీతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ అనేక మంది భాజపాలో చేరుతున్నారని పేర్కొన్నారు. దేశాన్ని సురక్షితంగా నిలబెట్టడాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్న రాంమాధవ్... కశ్మీర్ విషయంలో మోదీ రాజీపడ్డారని... సమాధానం చెప్పాలని ప్రతిపక్షం పట్టుబట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కశ్మీర్ మోదీ ప్రభుత్వం చేతుల్లో సురక్షితంగా ఉందన్నారు. కశ్మీర్ కోసం ఎవరూ మధ్యవర్తిత్వం చేయనవసరం లేదన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి... దేశపు వర్తమానం, భవిష్యత్తు భాజపాదేనని పేర్కొన్నారు. ఏపీలో వర్తమానం ప్రాంతీయ పార్టీదే అయినా... భవిష్యత్తు మాత్రం భాజపాదేనన్నారు.
ఇదీ చదవండీ...