Roads in Nellore: నెల్లూరులో అతి ప్రధానమైన ముత్తుకూరు - కృష్ణపట్నం రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. పెద్దపెద్ద గోతులతో వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. చెన్నై జాతీయ రహదారిని కలిపై బైపాస్‌రోడ్డుకు ఈ రహదారి ద్వారానే అనుసంధానించడంతో ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుంది. చెన్నై వైపు నుంచి నెల్లూరు ,ముత్తుకూరు, కృష్ణపట్నం పోర్టుకు చేరాలంటే ఈ రోడ్డు చాలా దగ్గర మార్గం.
అదేవిధంగా నెల్లూరు నగరంలోని హరనాధపురం, దనలక్ష్మీపురం, పొగతోటవైపు నుంచి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అపోలో, నారాయణ ఆస్పత్రులతో పాటు అనేక కళాశాలలు ఉండటంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇంత ప్రధానమైన రహదారి పూర్తిగా పాడైపోయింది. పెద్దపెద్ద గుంతలతో వాహనచోదకులకు చుక్కలు చూపిస్తోంది.
రెండేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో.. వర్షాలకు గోతులు పెద్దవిగా మారాయి. పోర్టు నుంచి వచ్చే భారీ వాహనాల దెబ్బకు మరింత పాడైపోయిందని స్థానికులు వాపోతున్నారు . రాత్రి సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయంటున్నారు. ఎంతో కీలకమైన ఈ మార్గంలో కనీసం వీధిలైట్లు కూడా లేవని నెల్లూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచదవండి: