పొరుగు జిల్లాల ఆహార అవసరాలకు నెల్లూరు జిల్లా ఎడగారు సీజనులో పండిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాతావరణ పరిస్థితులు, రైతుల విజ్ఞప్తులు, రాష్ట్ర ప్రభుత్వ లేఖ ఆధారంగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ కార్యదర్శి, వ్యవసాయశాఖ కార్యదర్శితోపాటు హోంశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. అదనంగా సేకరించిన ధాన్యాన్ని ఇరుగు పొరుగు జిల్లాల అవసరాలకు పంపిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. సోమవారం దీనికి సంబంధించి అనుమతులు ఇస్తూ ఫుడ్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
నెల్లూరు రైతులపై కేసులు ఎత్తేయండి: సీఎం
నెల్లూరు జిల్లాలో రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పోలీసులను ఆదేశించారు.
రైతులపై కేసులతో చెడ్డపేరు.. కాకాణి
జిల్లా ఎస్పీ అవగాహనా లోపం, అనుభవ రాహిత్యంతో రైతులపై కేసులు పెట్టడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని వైకాపా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. అధికారుల సమన్వయలోపం కారణంగా ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారన్నారు. జిల్లా ఎస్పీ వారిపై కేసులు పెట్టడం తొందరపాటు చర్యగా అభివర్ణించారు.
ఇదీ చదవండి: రాజధానిపై విచారణ అక్టోబర్ 5కు వాయిదా