కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి లక్ష్మీదేవి(55) కుమార్తె చంద్రకళ. రవికుమార్ అనే వ్యక్తికి ఇచ్చి చంద్రకళకు వివాహం చేశారు. కుటుంబ కలహాలతో కూతురు మరణించింది. చంద్రకళకు ఇద్దరు పిల్లలు. వారు అమ్మమ్మ వద్దే ఉంటున్నారు. మనవడు చందన కుమార్కు రెండు కిడ్నీలు పాడైపోవడంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. తల్లిలేక తండ్రి ఆదరణ లేక కష్టపడుతున్న పిల్లలను అమ్మమ్మ లక్ష్మీదేవి పెంచి పోషిస్తుంది. పిల్లల పోషణ, వైద్య చికిత్స కోసం ఉన్న కాస్త భూమిని అమ్ముకున్నామని లక్ష్మీదేవి తెలిపారు. మనవడు వైద్యం కోసం అప్పులు చేయక తప్పడం లేదని ఆవేదన చెందారు. కరోనా సమయంలో కడప నుంచి నెల్లూరుకు రావడానికి చాలా ఇబ్బందులు పడ్డామన్నారు.
వారానికి రెండుసార్లు డయాలసిస్ కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి వస్తున్నామని లక్ష్మీదేవి తెలిపారు. బస్సులు లేకపోవడంతో బ్రహ్మంగారి మఠం నుంచి అద్దె వాహనంలో వస్తుండడంతో ఖర్చు పెరుగుతోందంటున్నారు. కరోనా సమయంలో డయాలసిస్, ప్రయాణ ఖర్చులకు రూ.1.50 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. బ్రహ్మంగారి మఠం వద్ద టెంకాయలు, పూలు అమ్ముకుంటూ జీవనం సాగించే తనకు అప్పులు తీర్చడం కష్టంగా మారిందని ఈటీవీ భారత్తో ఆవేదన పంచుకున్నారు. తన దీనస్థితిని చూసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇస్తున్న పింఛన్, రేషన్ కొంత ఆదరువుగా మారిందని ఆమె చెబుతున్నారు. మనవడి వైద్య ఖర్చు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మనవరాలు సాయి చందన(5)ను ఎలా చదివించాలో అర్థం కావడంలేదని వాపోయింది.
ఇదీ చదవండి : 'ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలి'