వ్యాపార అవసరాల కోసమే జగన్‌కు అమరావతి గుర్తొస్తుందా అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ప్రశ్నించారు. నూతన రాజధానిలో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సిమెంట్ అవసరం కనుక సరస్వతి సిమెంట్ సంస్థకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరిన జగన్... అధికారంలోకి వచ్చాక రాజధానిని మూడు ముక్కలు చేసేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 'సరస్వతి సంస్థలో తనకు, తన సతీమణి భారతీరెడ్డికి భాగస్వామ్యం ఉందని ఎన్నికల అఫిడవిట్లో జగన్ పేర్కొన్నారు. దీనికి పర్యావరణ అనుమతులు పనురుద్ధరించాలని 2019 ఫిబ్రవరి 19న దరఖాస్తు చేశారు. అంటే మీ సంస్థ కోసం రాజధానిని గొప్పగా పొగిడారా?' అని మండిపడ్డారు.
'సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ నిబంధనల్లో మొదట సిమెంట్ కర్మాగార ప్రస్తావన లేదు. 2008 జులై 15న బోర్డు సమావేశంలో సిమెంట్ పరిశ్రమ నిర్వహణకు వీలుగా సవరణలు చేశారు. కానీ 2008 జూన్ 12న గనుల శాఖ మెమో ఆధారంగా సరస్వతీ ఇండస్ట్రీస్‌కు 613.70హెక్టార్ల గనులు కేటాయించినట్లు 2009 మే 18న ప్రభుత్వం పేర్కొంది. అంటే తండ్రి సీఎంగా ఉన్న సమయంలో కంపెనీ నిబంధనలను సవరించక ముందే భూ కేటాయింపుల మెమోను నడిపించేశారు.
రెండేళ్లు గడిచినా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడకపోవటంతో 2012లో ప్రభుత్వం రెండు షోకాజ్ నోటీసులిచ్చింది. వాటికి కంపెనీ సరైన సమాధానం ఇవ్వకపోవటంతో 2014 అక్టోబర్ 9న మైనింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ జీవో నంబర్ 98 ఇచ్చింది. లైసెన్స్ పునరుద్ధరించాలంటూ సరస్వతి సంస్థ నవంబర్ 6న కోర్టును అశ్రయించింది.
పర్యావరణ అనుమతులకు ఏడేళ్ల కాలపరిమితి ముగియటంతో 2019 ఫిబ్రవరి 19న పునరుద్ధరణ కోసం చేసిన దరఖాస్తుల్లో వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయా అంటే లేవని రాశారు. లీజు పునరుద్ధరణ కోరుతూ కోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను ఎందుకు దాచిపెట్టారు? కేటాయించిన 613.47 హెక్టార్లలో 25.4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని పర్యావరణ అనుమతుల దరఖాస్తుల్లో పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 15న కోర్టు విచారణలో మొత్తం ప్రైవేట్ భూములేనని చెప్పారు. దీంతో కోర్టు జీవో 98ను కొట్టి వేస్తూ మైనింగ్ లీజులను రెన్యూవల్ చేయాలని ఆదేశించింది.' పట్టాభి-తెదేపా అధికార ప్రతినిధి.