food Poison: కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 42 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అప్రమత్రమైన అధికారులు అస్వస్థతకు గురైన విద్యార్థులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. చికిత్స చేయించారు. ప్రస్తుతం వారిని చిన్నపిల్లల వార్డులో పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారన్నారు.
సమాచారం అందుకున్న పిల్లల తల్లిదండ్రులు.. ఆస్పత్రికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన తమ పిల్లలను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల అరోగ్యంపై ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులకు సూచించారు. నంద్యాల తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా నాయకుడు ఎన్.ఎం.డి.ఫిరోజ్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలోనూ..
అనంతపురం జిల్లా కక్కలపల్లిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని అనంతపురం ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు. పాఠశాలలో తిన్న ఆహారం వల్లే అస్వస్థత గురైనట్లు విద్యార్థులు తెలిపారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆస్పత్రిలోని పిల్లల వార్డు వద్ద ఆందోళన చేపట్టారు. పాఠశాల తనిఖీపై డీఈవోను ప్రశ్నించారు.
ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్
కక్కలపల్లిలో విద్యార్థుల అస్వస్థతపై డీఈవో అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను సైతం తొలగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎంపీ రంగయ్య పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
ఇదీ చదవండి: HC on TTD: తితిదే ప్రత్యేక ఆహ్వానితులపై హైకోర్టులో విచారణ