Garbage in Front of Stores at Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది. చెత్త పన్ను కట్టలేదని ఏకంగా దుకాణాల వద్దకు వెళ్లిన నగరపాలక సంస్థ సిబ్బంది.. దుకాణాల ముందు చెత్త వేసి వెళ్లిపోయారు. నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని శ్రీనివాస క్లాత్ మార్కెట్ నుంచి అనంత కాంప్లెక్స్ వరకు చెత్త పన్ను వసూలు చేసేందుకు వార్డు సచివాలయ పారిశుద్ధ్య సిబ్బంది ఇవాళ వెళ్లారు. ఆస్తి, నీటి పన్నుతోపాటు దుకాణాలకు ట్రేడ్ లైసెన్సుల రుసుం చెల్లిస్తున్నామని.. మళ్లీ ఈ చెత్త పన్ను ఎందుకు చెల్లించాలని దుకాణదారులు సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన నగరపాలక సంస్థ సిబ్బంది నగర వ్యాప్తంగా సేకరించిన చెత్తను ట్రాక్టర్లో తీసుకొచ్చి దుకాణాల ముందు పడేసి వెళ్లారు.
నగరపాలక సంస్థ సిబ్బంది వ్యవహారంపై స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెలకు రూ.200 చెత్తపన్ను కట్టలేమని దుకాణదారులు అంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా చెత్త పన్ను వసూలు చేయడం లేదని వాపోయారు. సిబ్బంది చేసిన తీరుతో చాలా అవమానంగా ఉందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల పన్ను ఒకేసారి కట్టాలని మాపై ఒత్తిడి తెచ్చారని.. దీనిపై సాయంత్రం మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడతామన్నా సిబ్బంది వినలేదని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే చెత్త పన్ను కట్టకపోతే ఈ విధంగానే ఉంటుందని సిబ్బంది దుకాణ యజమానులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: గుంటూరులో విషాదం.. మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు మృతి