రెండో దశలో కొవిడ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షల మంది దీని బారినపడి విలవిల్లాడిపోతుంటే మరెంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సందర్భంలో బాధితులకు ఎవరికి తోచిన మేర వారు సాయం అందిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎలాంటి ఆదరువు లేని మహిళల పరిస్థితి ఏంటి? వారికి ఆహారం ఎలా అనే ఆలోచన చేసింది కాకినాడకు చెందిన నారీసేన బృందం. ఈ బృందంలోని మహిళలు స్వయంగా బాధితుల ఇంటి వద్దకే వెళ్లి రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఎలాంటి ఆహారం అందిస్తే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారని పరిశీలించి మరీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇస్తున్నారు.
నారీసేన బృందంలో నలుగురు మహిళలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం దీనిని ఏర్పాటు చేశారు. పాత దుస్తులు సేకరించి పేదలకు అందిచడం, వృద్ధులకు సేవా కార్యక్రమాలు, మహిళలకు స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతలో కరోనా సంక్షోభం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోరనా సోకిన ఒంటరి మహిళలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. బృందంలో ఉన్న నిపుణలు సలహాతో మంచి పౌష్టికాహారం తయారుచేసి రోజుకు వంద మందికి పైగా కరోనా బాధితులకు అందిస్తున్నారు. మంచి ఆహారం ఇస్తే కరోనా నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంటుందని.... ఆ సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆహారం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. నారీసేన స్ఫూర్తితో కాకినాడలో మరికొందరు స్వచ్ఛందంగా కొవిడ్ పీడితులకు భోజనం పంపిణీ చేసేందుకు ముందుకు వస్తున్నారని మరికొంత మంది ఇలా సాయం చేసేందుకు రావాలని నారీసేన మహిళలు కోరుతున్నారు.
ఇదీ చదవండి
జ్యుడీషియల్ రిమాండ్‌లోని నరేంద్రను జైలుకు ఎలా తరలిస్తారు?: కోర్టు