రైతుల సమస్యలను బలంగా తెలియచేయడానికే ఈనెల 12న రైతు సౌభాగ్య దీక్ష నిర్వహిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒక రోజు నిరాహార దీక్షకు సంకల్పించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. దేశానికి అన్నపూర్ణ అయిన రాష్ట్రంలో మున్ముందు ఆ పరిస్థితి కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోందని ఆవేదన చెందారు. వరి పంట వేయడానికే రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలుంటున్నాయని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక, ఖర్చులు రాబట్టుకోలేక వరి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. తాను మండపేట పరిసరాల్లో పర్యటించి ధాన్యం రైతుల స్థితిగతులను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని వెల్లడించారు. వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు రైతుసౌభాగ్య దీక్షకు సిద్ధమైనట్లు తెలిపారు. పాదయాత్రలో జగన్ రెడ్డి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాలో డబ్బు వేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు ధాన్యం తీసుకున్న 45 రోజుల తరువాత హడావిడిగా అర్ధరాత్రి వేళ సీఎంఆర్ ప్రకటించి ఇంతవరకు రైతుకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీనివల్ల రబీ కోసం అయిదు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించవలసి వచ్చిందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా కౌలు రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి