BLAST AT SUGAR INDUSTRY:తూర్పుగోదావరి జిల్లా వాకలపూడిలోని పంచదార శుద్ధి కర్మాగారంలో.. పేలుడు జరిగి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు.. కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడం.. స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాదంపై విచారణ జరుపుతున్న పోలీసులు.. ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం.. వాకలపూడి పారిశ్రామికవాడలోని ప్యార్రీ షుగర్స్ రిఫైనరీ పరిశ్రమలో పేలుడు జరిగింగి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కన్వేయర్ బెల్ట్ తెగిపోయి మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో 8 మంది గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
క్షతగాత్రులను సమీపంలోని అపోలో, ఇనోదయ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పరిశ్రమ ప్రతినిధులు విచారం వ్యక్తంచేశారు. ప్రమాద స్థలిని.. మాజీ మంత్రి కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. ప్రమాద వివరాలు సేకరించారు.
మాజీ మంత్రి కన్నబాబు..: ప్యారీ షుగర్స్‌లో ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు.. ప్యారీ షుగర్స్ పరిశ్రమపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. గిడ్డంగిలో త్రీఫేస్ ఎంసీబీ పేలుడు వల్ల ప్రమాదం సంభవించిందని.. అగ్నిమాపక, విద్యుత్‌శాఖ అధికారులతో విచారణకు ఆదేశించామన్నారు.
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని.. కార్మికులు, ప్రజా సంఘాలు పరిశ్రమ ఎదుట బైఠాయించారు. వారిని పోలీసులు నిలువరించే యత్నం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. యాజమాన్యంతో చర్చలు జరిపే ఏర్పాటు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో. కార్మికులు, ప్రజాసంఘాలు శాంతించారు.
ఇవీ చదవండి: