Paddy Loss: గోదావరి జిల్లాల్లో వరి రైతుల కష్టం వర్షార్పణమైంది. అసని తుపాను రైతుల రెక్కల కష్టాన్ని ముంచేసింది. కోనసీమ జిల్లా మల్కిపురం మండలంలో పరిధిలో.. 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు, మధ్య డెల్టా పరిధిలో లక్షా 90 వేల ఎకరాల్లో..రైతన్నలు వరి సాగు చేశారు. 82 వేల ఎకరాల్లోనే కోతకోశారు. ధాన్యం ఇంటికి చేరకముందే తుపాను పంజా విసిరింది. పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, రాజోలు, అమలాపురం, మండపేట, రామచంద్రాపురం ప్రాంతాల్లో వరి పంట తడిసిముద్దైంది.
వర్షాల ప్రభావంతో ధాన్యపు రాశుల్ని కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ధాన్యం మొలకెత్తాయి. కోత కోయని వరి నేలకొరిగింది. చాలాచోట్ల జల్లులు.. ఆగి ఆగి కురుస్తుండటంతో రైతులు కోతకు వచ్చిన వరి గింజలు మొలకెత్తుతాయనే దిగులుతో ఉన్నారు. సీజన్లతో సంబంధం లేకుండా పంట నష్టపోతున్నామని అన్నదాతలు వాపోతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఆచంట, తణుకు, భీమవరం, ఉండి ప్రాంతాల్లోని.. వరి రైతుల పరిస్థితీ ఇదే. ఏలూరు జిల్లా ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు గ్రామీణ ప్రాంతాల్లో.. కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. 2 జిల్లాల్లోనూ సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల్లో వరి సాగవగా 3 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఒకటిన్నర లక్ష ఎకరాల్లో... కోతలకు సిద్ధంగా ఉంది. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి : CM on Cyclone: సహాయ శిబిరంలో వ్యక్తికి వెయ్యి, కుటుంబానికి రూ.2 వేలు: సీఎం జగన్