ఏపీఎస్‌ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన విద్యుత్ బస్సులు తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ అనుమతించారు. కేంద్రం ఆమోదంతో తిరుమల ఘాట్‌లో తొమ్మిది మీటర్ల పొడవుండే 150 బస్సులు, విజయవాడ, విశాఖ నగరాల పరిధిలో 12 మీటర్ల పొడవుండే వందేసి బస్సుల చొప్పున 350 బస్సులకు ప్రతిపాదనలు పంపగా.. ఇందులో తిరుమల ఘాట్‌లో 100 బస్సులకే అనుమతించారు. మిగిలిన 50 బస్సులను కాకినాడకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆ 50 బస్సుల అనుమతి కోసం కేంద్రానికి ఏపీఎస్‌ఆర్టీసీ తాజాగా లేఖ రాసింది. కేంద్రం ఫేమ్-2 పథకం కింద ఒక్కో విద్యుత్ బస్సుకు గరిష్ఠంగా రూ.55 లక్షల వరకు గుత్తేదారు సంస్థకు సాయం అందించనుంది.
విద్యుత్ ఖర్చు ఆర్టీసీదే..
విద్యుత్ బస్సుల దస్త్రాన్ని త్వరలో న్యాయసమీక్షకు పంపి, తర్వాత టెండర్లు పిలుస్తారు. ఎంపికైన గుత్తేదారు సంస్థ, బస్సు తయారీ కంపెనీలు 12 ఏళ్లపాటు ఆర్టీసీలో విద్యుత్ బస్సులు నడపనున్నాయి. ఇవన్నీ ఏసీ బస్సులే కాగా, కిలోమీటరుకు దాదాపు రూ.50 వరకు కోట్ చేసే అవకాశాలున్నట్లు అంచనా. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న ఏసీ బస్సులతో కి.మీ.కి రూ.47 వరకు ఖర్చవుతోందని అధికారులు చెబుతున్నారు. డీజిల్ ధరలను బట్టి ఇది మరింత పెరిగే అవకాశముంది. మరోవైపు ఎంపికైన గుత్తేదారు సంస్థలకు బస్సులు నిలిపేందుకు ఆర్టీసీ డిపోల్లో స్థలం, ఛార్జింగ్ పాయింట్లు ఇస్తారు. బస్సుల ఛార్జింగ్‌కు అయ్యే విద్యుత్ భారాన్ని ఆర్టీసీ భరించనుంది. 9 మీటర్ల పొడవుండే బస్సులకు కి.మీ.కు ఒక యూనిట్, 12 మీటర్ల బస్సులకు కి.మీ.కు 1.2 యూనిట్ల చొప్పున విద్యుత్ వినియోగాన్ని పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తే.. ఆ మొత్తాన్ని గుత్తేదారు సంస్థ నుంచి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్