మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 47 రోజులుగా కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు.. ఇవాళ దర్యాప్తులో కీలక ముందడుగు వేశారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలాన్ని జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయించారు.
ఇవాళ ఉదయం కడప నుంచి సీబీఐ అధికారులు రంగన్నను తీసుకుని జమ్మలమడుగు వెళ్లారు. 11 నుంచి 12 గంటల మధ్యలో జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఫకృద్ధీన్ సెక్షన్ 164 కింద రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. వాంగ్మూలం నమోదు చేసే సమయంలో మెజిస్ట్రేట్... రంగన్న మినహా మిగిలిన వారెవ్వరూ లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది. స్టెనో కూడా లేకుండా మెజిస్ట్రేట్ స్వయంగా వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం. వివేకా హత్యకేసుకు సంబంధించి రంగన్న చెప్పిన విషయాలను మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. పులివెందుల మెజిస్ట్రేట్ అందుబాటులో లేనందున ఇన్ ఛార్జిగా ఉన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందుకు సీబీఐ అధికారులు రంగన్నను తీసుకెళ్లారు. తర్వాత రంగన్నను సీబీఐ అధికారులు కడపకు తీసుకొచ్చారు. మెజిస్ట్రేట్ వద్దనున్న వాంగ్మూలం పరిశీలించిన తర్వాత సీబీఐ అధికారులు తదుపరి కార్యాచరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వివేకా హత్య కేసులలో (viveka murder case) సీబీఐ విచారణ వేగవంతం చేసింది. 47 రోజులుగా కడపలోనే మకాం వేసిన దర్యాప్తు సంస్థ అధికారులు.. అనుమానితులను ప్రతి రోజూ ప్రశ్నిస్తున్నారు. అవసరాన్ని బట్టి పులివెందులకు సైతం వెళ్లి విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి: