ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమావేశమయ్యారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. కడప జిల్లాల్లో మరో భారీ స్టీల్ ప్లాంట్ పెడతామంటూ ఐఎంఆర్ ఏజీ ఛైర్మన్ హాన్స్ రడాల్ఫ్ వైల్డ్ ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన ఉంచారు. ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.
సహకారం అందిస్తాం
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఐఎంఆర్ కూడా మరొక స్టీల్‌ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు, రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు.
ప్రాంతాల పరిశీలన
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఐఎంఆర్ స్టీల్స్ ప్రతినిధులు జమ్మలమడుగు మండలంలోని బ్రాహ్మణి పరిశ్రమ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. రవాణా వసతి, నీటి లభ్యత, మౌలిక వనరుల గురించి అధికారులను ఆరా తీశారు. బ్రాహ్మణి యాజమాన్యం చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 ఉక్కు కర్మాగారాలు రానున్నట్లు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి: