RSI SUICIDE: కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రారావు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రారావు.. కడపలో పనిచేస్తూ తోటి పోలీసులతో కలిసి ఉంటున్నాడు. వారంతా విధులకు వెళ్లిపోయిన తర్వాత.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని కడప రిమ్స్ కు పోస్టుమార్టం కోసం తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రరావు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని శ్రీకాకుళంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించారు. కాగా.. మృతుని గదిని పరిశీలిస్తే.. సూసైడ్ నోట్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు. అందులో.. తనకు ఉద్యోగం ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నట్లు సమాచారం. కేవలం తల్లిదండ్రుల కోరిక మేరకు ఉద్యోగంలో చేరాను తప్పితే.. తనకు పోలీసు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని లేఖలో రాసి ఉన్నట్లు తెలిసింది.
అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ మొదలు పెట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు విచారణ తరువాత తెలిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రారావు 2020 బ్యాచ్ కు చెందినవాడు. ఆరునెలల కిందటే నాన్ లోకల్ కేటగిరీ కింద కడపలో ఆర్ఎస్ఐగా విధుల్లో చేరాడు. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
ఇదీ చదవండి: Mother and Daughter suicide: కాలువలో దూకిన తల్లీకూతుళ్లు...కారణం..??