Students Protest: మరికొద్ది సేపట్లో పరీక్ష ప్రారంభమవుందనగా.. పరీక్ష కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కొంతమంది విద్యార్థులు గేటు ఎదుట ఆందోళనకు దిగారు.. తీరా విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారా అని చూసేసరికి ఆశ్యర్యకరమైన విషయం తెలిసింది.
కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 357 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి పరీక్ష రాసేందుకు వచ్చారు. కొంతమంది విద్యార్థులు పుస్తకాలు లోపలికి తీసుకెళ్తామని పట్టుబట్టారు. దీంతో ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి అడ్డుకున్నారు. హాల్‌టికెట్‌తో పాటు పెన్ను, ప్యాడు మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. అయితే పూర్తి ఫీజు చెల్లించినా స్టడీ మెటీరియల్ ఇవ్వలేదని.. బయట దీనికి సంబంధించిన పుస్తకాలు లభించలేదని విద్యార్థులు వాపోయారు.. పుస్తకాలు లేకుండా పరీక్ష ఎలా రాయాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే పరీక్ష రాసేందుకు వచ్చేవారిని కొంతమంది అడ్డుకుంటున్నారని ప్రిన్సిపల్ తెలిపారు.
కళాశాలలో జరుగుతున్న ఆందోళన సమాచారం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పట్టణ ఎస్ఐ రఘురాం.. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడి పరీక్ష రాసేలా చొరవ చూపారు. కాపీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అధ్యాపకులు తెలిపారు.
ఇదీ చదవండి:
దాణా స్కామ్ ఐదో కేసులోనూ లాలూ దోషి- త్వరలోనే మళ్లీ జైలుకు..