కరోనా కలవరపెడుతోంది. ఆవిరి పట్టేందుకు అవసరమైన క్యాప్సూళ్లు, వేపరైజర్ పరికరాలకూ డిమాండు నెలకొంది. దీంతో సామాన్యుల నుంచి కరోనా బాధితుల వరకు అందరికీ ఇబ్బంది తప్పట్లేదు. జిల్లాలో ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోంది. గతంలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వచ్చేవి. ప్రస్తుతం నిత్యం వందల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అదే స్థాయిలోనే డిశ్చార్జిలు, మరణాలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ప్రతి ఒక్కరూ రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలని సూచిస్తోంది. దీంతో చాలామంది విటమిన్ మాత్రల కోసం ఔషధ దుకాణాల వద్దకు వరుస కడుతున్నారు. కొందరు అవసరం లేకపోయినా రెట్టింపు మొత్తంలో నిల్వ కోసం వీటిని కొనుగోలు చేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది.
కరోనా వ్యాప్తి ప్రారంభ సమయంలో మాస్కులు, శానిటైజర్లకు డిమాండు ఏర్పడింది. ఒకదశలో వాటిని ఎక్కడికక్కడ రెట్టింపు ధరలకు విక్రయించారు. క్రమంగా వాటి ఉత్పత్తి పెరిగింది. ప్రస్తుతం దుకాణాల్లో వివిధ సంస్థలకు చెందిన ఆయా ఉత్పత్తులు విరివిగా దొరుకుతున్నాయి. ఇప్పుడు విటమిన్, ఇతర మాత్రలకు డిమాండు ఏర్పడింది. ఆవిరి యంత్రాలు దొరకట్లేదు. వీటి పరిమాణాన్ని అనుసరించి రూ.250 నుంచి రూ.450 వరకు పలుకుతున్నాయి. అందుబాటులో ఉన్న కొన్నిచోట్ల అధిక మొత్తాలకు అమ్ముతున్నారు. ఎక్కువ దుకాణాల్లో ఇవి కూడా లేవని చెబుతున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండే కరోనా బాధితులకు ఇచ్చే కిట్లలో విటమిన్ మాత్రలు ఉండట్లేదు. ఫలితంగా వీటిని ప్రైవేటులో కొనుగోలు చేయాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. బాధితులు వాటిని సన్నిహితుల ద్వారా తెప్పించుకునేందుకు యత్నించి విసిగిపోతున్నారు. ఔషధ దుకాణాల్లో మాత్రలకు కొరత ఉండటంతో కొందరు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వాటి సరఫరాకు ఎక్కువ సమయం పడుతోంది. వేపరైజర్లనూ ఇదే రీతిలో తెప్పించుకుంటుండడం గమనార్హం.
● విటమిన్ మాత్రలతోపాటు కొన్ని మందుల లభ్యత తక్కువగా ఉంది. అజిత్రోమైసిన్, లెవోసిట్రిజైన్ విత్ మాంటెలుకాస్ట్, కార్వోల్ ప్లస్ తదితర మాత్రలు కూడా అధికంగా అమ్ముడుబోతున్నట్లు దుకాణదారులు తెలిపారు.
● వైరస్ విజృంభిస్తున్న వేళ జిల్లాలో మాస్కులు, చేతి తొడుగులు (గ్లౌజ్) ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో చేతి తొడుగుల కొరత ఏర్పడింది. తక్కువ ధర ఉన్న గ్లౌజులు దుకాణల్లో దొరకడం కష్టంగా మారింది. ఎక్కువ ధర ఉన్నవి లభ్యమవుతున్నా సామాన్యులు వాటిని కొనలేని పరిస్థితి.
● గతంలో చేతి తొడుగులు చైనా నుంచి దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం అక్కడి సరకుని దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో గ్లౌజుల కొరత ఏర్పడింది. ధర కూడా పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు.
కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన ఒక వ్యక్తి కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తన రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా విటమిన్ సి, డి, ఇతోపాటు మల్టీ విటమిన్ ఔషధాలు కొనుగోలు చేసేందుకు నాలుగు దుకాణాలు తిరిగారు. ప్రతి చోటా నిల్వలు లేవని చెప్పడంతో ఆయన నిరాశ చెందారు. అలాగే ఆవిరి పట్టేందుకు అవసరమైన క్యాప్సూళ్లు, వేపరైజర్ పరికరం అడిగినా.. అటువైపు నుంచి స్టాకు లేదనే సమాధానం రావడంతో ఆయన కంగుతిన్నారు.
ప్రొద్దుటూరుకు చెందిన ఒక కరోనా బాధితుడు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత వైద్య సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి 14 రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకు ఒక కిట్ అందించారు. అందులో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు అవసరమైన విటమిన్ మాత్రలు లేకపోవడంతో.. వాటిని ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాలని చెప్పారు. తన స్నేహితుడి ద్వారా వాటిని తెప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఈ కారణంగా పండ్లు, ఇంట్లో తయారు చేసే కషాయాలతో రోగనిరోధకశక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పండ్లు తీసుకోవడం ఉత్తమం
కరోనా నేపథ్యంలో కొన్ని విటమిన్ మాత్రలకు కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అయినా ప్రజల అవసరాల కోసం వాటిని వీలైనంతమేర అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రజలు విటమిన్లు అధికంగా ఉండే నిమ్మజాతి లాంటి పండ్లను తీసుకోవడం ఉత్తమం. ఇవి మాత్రల కంటే ఎక్కువ మేలు చేస్తాయి. - చంద్రారావు, సహాయ సంచాలకుడు, ఔషధ నియంత్రణ శాఖ, కడప జిల్లా
ఇదీ చదవండి :రాష్ట్రంలో కరోనా విజృంభణ... మరో 7822 కరోనా కేసులు