కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఏజెంట్లు ధర్నా చేశారు. ఎల్ఐసీ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకోవాలంటూ... రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ ఏజెంట్లు నిరసన చేపట్టారు.
ఎల్ఐసీ ప్రైవేటీకరణకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆ సంస్థ కార్యాలయం ఎదుట ఏజెంట్లు నిరసన తెలిపారు. ఎల్ఐసీపై జీఎస్టీ ఎత్తివేసి పాలసీదారులకు బోనస్ పెంచాలన్నారు. అలాగే ఏజెంట్ల కమిషన్ పెంచాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా మైదుకూరు జాతీయ బీమా సంస్థ కార్యాలయం వద్ద ఎల్ఐసీ ఏజెంట్ ఫెడరేషన్ ప్రతినిధులు ధర్నా చేశారు. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. పాలసీదారులు తీసుకునే రూణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షుడు చాంద్బాషా పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం జీవిత బీమా కార్యాలయం వద్ద బీమా ఏజెంట్లు నిరసన తెలిపారు. ఉద్యోగులు, డీవోలు మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణ యత్నాలను కేంద్రం ఇప్పటికైనా విరమించుకోవాలని కేంద్రాన్ని కోరారు.
విజయవాడలో
భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో ఏజెంట్లు నిరసన చేపట్టారు. ఎల్‌ఐఏఎఫ్‌ఐ ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక ఎల్ఐసీ బ్రాంచి వద్ద ఆందోళన చేపట్టారు. పాలసీ రెన్యువల్ కాలపరిమితిని రెండేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచాలి, వెల్త్ ప్లస్ మెచ్చురిటీలలో పాలసీదారులకు న్యాయం చేయాలి, ఏజెంట్లకు మెడిక్లైమ్‌ను రూ. 10 లక్షలకు పెంచాలి, గ్రూపు టర్న్ ఇన్సూరెన్స్‌ను రూ. 20 లక్షల వరకు పెంచాలి, ఐఆర్డీఏ ప్రతిపాదించిన ఏజెంట్ల కమిషన్‌ను వెంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:
బాపట్లలో జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం..!