కడప జిల్లాలో కొవిడ్ బాధితుల కోసం దాతలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కరోనా వ్యాప్తి వేళ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పడకలు దొరకని దుస్థితి నెలకొంది. ఈ మేరకు దాతలు సహాయం చేయాలంటూ.. జిల్లా ప్రజా ప్రతినిధులు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో అదానీ గ్రూపు.. కోటి రూపాయలతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు అందజేసింది. భారతి సిమెంటు కూడా 22 లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ సిలెండర్లు అందజేసింది.
తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి సమీప బంధువు.. వీరభద్ర మినరల్స్ ఎండీ ప్రతాప్‌రెడ్డిని సాయం కోరగా.. కోటి రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో కడప రిమ్స్ సమీపంలోని అంబేడ్కర్ భవన్‌లో కొవిడ్ ట్రాన్సిట్ కేర్ సెంటర్‌ను మూడు వారాల్లో పూర్తి చేశారు. 200 పడకల సామర్థ్యంతో ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన పైపులైన్లు సమకూర్చారు. ఈ ట్రాన్సిట్ కేంద్రాన్ని శనివారం ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభించారు.
ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ పాజిటివీ రేటు 15 శాతంగా ఉంది. కానీ ఇప్పటికీ ఆక్సిజన్ పడకలు కావాలని సిఫారసులు వస్తున్నాయి. వీటి నుంచి గట్టెక్కేందుకు వీరభద్ర మినరల్స్ దాతృత్వం చాటుకోవడం శుభపరిణామమని ప్రజాప్రతినిధులు అన్నారు. మూడు వారాల్లోనే ట్రాన్సిట్ కేంద్రం పూర్తి కావడానికి జిల్లా అధికారులు ప్రత్యేక కృషి చేశారని ప్రశంసించారు. కొవిడ్ బాధితుల బాగోగులు చూసుకునేందుకు నియమించిన తాత్కాలిక సిబ్బంది.. ఈ ట్రాన్సిట్ కేంద్రంలో పనిచేస్తారని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
ఇవీ చదవండి: