రైతు అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యవసాయం చేసుకునేవిధంగా చర్యలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ సూచించారు. ఈ నెల 26వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల తీర్మానాలను సిద్ధం చేసి నివేదికలు అందించాలని, మార్చి 31వ తేదీ నాటికి పెండింగ్‌లో ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో జేడీ మురళీకృష్ణ, ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, ఉద్యానశాఖ డీడీ వజ్రశ్రీ, పీఆర్ ఎస్‌ఈ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు ప్రచారం
జిల్లాలో ఆడపిల్లల శాతాన్ని పెంచేందుకు భ్రూణహత్యలను అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గర్భస్థ లింగ నిర్ధరణ, మాతాశిశు మరణాలపై న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వెంకటరాజేశ్‌కుమార్, సంయుక్త కలెక్టర్ సాయికాంత్‌వర్మతో కలిసి జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధరణకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. న్యాయమూర్తి వెంకటరాజేశ్‌కుమార్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధరణ చట్టం అమలుకు అధికారులు, సిబ్బంది మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో అనిల్‌కుమార్, ఐసీడీఎస్ పీడీ పద్మజ, డీఎస్పీ దేవప్రసాద్, డీపీవో ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
మాతృమరణాలు తగ్గించేందుకు
జిల్లాలో మాతృమరణాలు పూర్తిస్థాయిలో తగ్గించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ , ఐసీడీఎస్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసూతి మరణాల విచారణ కమిటీతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు వైద్య సేవలందించేవిధంగా ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, దానికి అనుబంధంగా అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్‌పై జ్యోతి సంచలన విజయం!