కడప జిల్లా బ్రహ్మంగారిమఠం(BRAMHAMGARI MATAM) పీఠాధిపత్యం వివాదం హైకోర్టుకు చేరడంతో.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. నాలుగు రోజుల కిందట సమస్య పరిష్కారమైందని అందరూ భావించినా.. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్ష్మీ హైకోర్టుకు వెళ్లటంతో సమస్య మరింత జఠిలంగా మారింది. తన కుమారుడికే పీఠం దక్కే విధంగా వీలునామా ఉన్నందున న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని ఆమె పిటిషన్‌లో కోరారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగే అవకాశముంది.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారు జీవసమాధి పొందిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో పీఠాధిపత్యం సమస్య మరింత జఠిలంగా మారింది. దివంగత పీఠాధిపతి వీరబోగ వసంత వెంకటేశ్వరస్వామి మొదటి భార్య నలుగురు కుమారులు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మీ ఇద్దరు కుమారుల మధ్య అధికారులు, నేతలు మధ్యవర్తిత్వం చేసినా వివాదం సమసిపోలేదు. 12వ పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. గత నెల 26న దేవదాయశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు MLA రఘురామిరెడ్డి సమక్షంలో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని అందరూ అంగీకరించారు. ఈమేరకు రెండు కుటుంబాల వారు మీడియా ముందుకు వచ్చి ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రకటించారు. 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి, ఉత్తరాధికారిగా భద్రయ్యస్వామి..వారి తదనంతరం మారుతీ మహాలక్ష్మి పెద్ద కుమారుడు గోవింద స్వామి పీఠాధిపతి అయ్యే విధంగా కుటుంబసభ్యుల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ అదే రోజు అర్ధరాత్రి మారుతీ మహాలక్ష్మమ్మ బ్రహ్మంగారిమఠం నుంచి స్వగ్రామం ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయారు. ముందు నుంచి పెద్దమనుషుల ఒప్పందం పై అయిష్టంగా ఉన్న మారుతి మహాలక్ష్మి.. ఇపుడు ఏకంగా హైకోర్టుకు వెళ్లారు.
మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు గోవిందస్వామి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా దీనిపై విచారణ జరపాలని బుధవారం న్యాయమూర్తిని కోరగా.. గురువారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 2018 నవంబర్ 10న వీలునామా రాశారని..తన తరువాత రెండో భార్య కుమారుడు గోవిందస్వామికి శాశ్వత పీఠాధిపతిగా నియమించాలని అందులో సూచించారని మారుతి మహాలక్ష్మి పిటిషన్‌లో పేర్కొన్నారు. తమను మఠానికి తదుపరి వారసులుగా నామినేట్ చేస్తూ 2010 అక్టోబర్ 1 న వసంత వేంకటేశ్వరస్వామి..AP ధార్మిక పరిషత్‌కు తెలియజేశారనీ పిటిషన్‌లో పేర్కొన్నారు. పెద్దకుమారుడే మఠాధిపతిగా కొనసాగాలనే సంప్రదాయం లేదని వివరించారు. వీలునామానూ పిటిషన్‌తో జతచేశారు. వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని పిటిషన్‌లో పేర్కొన్న మహాలక్ష్మీ బ్రహ్మంగారి మఠం భక్తులు, గ్రామస్థులు సహృదయంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
"మారుతీ మహాలక్ష్మమ్మ హైకోర్టుకు వెళ్లిందనే సమాచారంతో..మొదటి భార్య పెద్ద కుమారులు ఆందోళనకు గురయ్యారు. మారుతీ మహాలక్ష్మమ్మను ఎవరూ ఒత్తిడి చేయలేదని.. దేవాదాయ శాఖ అధికారులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఏకాభిప్రాయం కుదిరిందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. మఠం పవిత్రను దృష్టిలో పెట్టుకుని.. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినా ప్రభుత్వం శిరసావహిస్తుందని ఆయన స్పష్టం చేశారు." -రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే
ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మ మఠం నుంచి కారులో ఏడు బ్యాగులతో వెళ్లిపోయారని కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగుల్లో మఠానికి సంబంధించిన విలువైన వస్తువులు ఉంటాయని భావిస్తున్నామని.. వాటిపై విచారణ జరిపించాలని కోరారు.
ఇదీ చదవండి:
brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!