గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నాయకులు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో భాజపా శ్రేణులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.
మంగళగిరిలో..
ప్రభుత్వం అనుమతించిన ఇవ్వకపోయినా వినాయక చవితి పండుగ నిర్వహించి తీరతామని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. వినాయక చవితి పండుగకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వినాయక చవితికి అనుమతులు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం పండుగ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోతే అయోధ్య కర సేవకుల తరహాలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
మచిలీపట్నంలో..
వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో భాజాపా నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించిన భాజపా నేతలు కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, భాజపా నేతల మధ్య వాగ్వివాదం చేటు చేసుకుంది. అనుమతులు లేకుండా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన భాజపా నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఆ పార్టీ నేతలు నూకల శేషయ్య నాయుడు, ఎన్ రాము, విఠల్ సాయి, నున్న అరవింద్.. ఉన్నారు
నంద్యాలలో..
గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి, రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ ధర్నా నిర్వహించింది. స్థానిక గాంధీ చౌక్ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు తీసుకురావడం ప్రభుత్వానికి సరికాదన్నారు.
కడప కలెక్టరేట్లో..
వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడపలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు సాగింది. కలెక్టరేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా ఆందోళనకారులు బారికేడ్లను కిందకు తోసేసి కలెక్టరేట్ ప్రధాన ద్వారాలను తోసుకుంటూ కలెక్టరు ఛాంబర్ వద్దకు వెళ్లారు. పోలీసులు అడ్డుకున్న అప్పటికీ ఆందోళనకారులను ఆపలేకపోయారు. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణం వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
నెల్లూరులో..
వినాయక చవితి వేడుకల రద్దును నిరసిస్తూ నెల్లూరులో భారతీయ జనతా పార్టీ, గణేశ్ ఉత్సవ సమితులు ఆందోళన చేపట్టాయి. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు భాజపా శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించాయి. గణేశ్ ఉత్సవాలను రద్దు చేయటం దుర్మార్గమని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకునేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గణేశ్ ఉత్సవాల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే హిందూ భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
పెనుకొండలో..
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిరంకుశత్వం చూపిస్తుందని భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా పెనుకొండలో భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా మహిళలు మట్టి వినాయకులు చేతపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ నవీన్‌కు వినతి పత్రం అందించారు.
ఇదీ చదవండీ.. ట్రాన్స్‌జెండర్ల రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ