చుట్టూ నాలుగు స్తంభాలతో గోపురం ఆకారంలో నిర్మించిన ఈ సమాధి చూస్తే.. ఎవరో చనిపోతే వారి జ్ఞాపకార్థం నిర్మించారనుకుంటే పొరపాటే. ఈ సమాధి పక్కనే తచ్చాడుతున్న 82 ఏళ్ల పెద్దాయన.. 2 దశాబ్ధాల కిందటే తన కోసం స్వయంగా నిర్మించుకున్న కట్టడమది. కడపలోని ఎర్రముక్కపల్లెకు చెందిన.. పొన్నగంటి వెంకటయ్య అలియాస్ కిరసనాయిల్ వెంకటయ్య 2000 సంవత్సరంలో రూ. లక్ష వ్యయంతో ఈ సమాధి నిర్మించుకున్నారు. 5 అడుగుల లోతు వరకు మట్టి తవ్వి తీసి.. వాటిపైన ఇటుకలు పేర్చి పైన బండ పరుపు వేశారు. చుట్టూ ప్రాకారాలు నిర్మించి మందిరం మాదిరిగా ఏర్పాటు చేసుకున్నారు. సమాధిపైన శివలింగాన్ని ఏర్పాటు చేశారు. తాను చనిపోతే ఈ సమాధిలో పూడ్చిపెట్టాలని తన సంతానానికి ముందే చెప్పారు వెంకటయ్య.
అనాథగా పెరిగి రంగుల ప్రపంచంలో మెరిసి..
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న వెంకటయ్య.. అనాథలా పెరిగి ఎంతో కష్టపడ్డారు. పెద్దయ్యాక నాటకాల మీద పిచ్చితో రైలెక్కి మద్రాస్ వెళ్లారు. ఎన్నో వీధి నాటకాలు, స్టేజి నాటకాలు వేశారు. 1962 మధ్య కాలంలో వివిధ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. సరైన అవకాశాలు రాక తిరిగి కడపకు వచ్చేశారు.
రూ. 200లతో వ్యాపారం ప్రారంభించి..
ఓ దాత ఇచ్చిన రూ. 200 లతో కిరోసిన్ వ్యాపారం మొదలు పెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి బాగా డబ్బు సంపాదించి.. పొన్నగంటి వెంకటయ్య కాస్తా కిరసనాయిల్ వెంకటయ్యగా మారారు. లక్షల రూపాయల వ్యాపారం చేసి డబ్బు కూడబెట్టారు. ఈయనకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. వారూ బాగా స్థిరపడ్డారు. పూరిగుడిసె నుంచి భవంతి వరకు ఎదిగాడు. జీవితంలో అన్నీ అనుభవించిన వెంకటయ్య.. సంతోషంగా తనువు చాలించాలని చూస్తున్నారు. ఓ వైపు చావును ఆహ్వానిస్తూనే.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సమాధి నిర్మించి 21 సంవత్సరాలు గడుస్తున్నా.. తనకు దైవం నుంచి పిలుపు రావడం లేదని నిట్టూరుస్తున్నారు. ఎప్పుడు పిలుపు వచ్చినా హాయిగా తనువు చాలిస్తానని అంటున్నారు. కొందరు శ్మశానంలోకి రావాలంటేనే భయపడతారని.. తనకు మాత్రం ఎలాంటి భయం లేదని పొన్నగంటి వెంకటయ్య అంటున్నారు. ఏటా 20 మందికి దాతల సహకారంతో గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇప్పటివరకు తన చేతుల మీదుగా 400 జంటలకు పెళ్లిళ్లు జరిపించారు.
ఆశ్చర్యపోతున్న స్థానికులు..
బతికుండగానే సమాధి నిర్మించుకున్న వెంకటయ్య తెగువను చూసి కడపవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఏమనుకున్నా తాను ఇలాగే ఉంటానని అంటున్న వెంకటయ్య.. బతికుండగానే సమాధి నిర్మించుకుని.. చివరి మజిలీకి స్వాగతం చెబుతున్నారు.
''పుట్టిన వాడు గిట్టక తప్పదు. గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నా. పిల్లలకు భారం కాకూడదనే సమాధి నిర్మించుకున్నా. నేను చాలా బీదవాడిని. అట్టడుగు స్థాయి నుంచి కిరోసిన్ అమ్ముకుని ఎదిగా. నా స్థోమతకు తగ్గట్టుగా ఇతరులకు సాయం చేస్తున్నా. నా అభిరుచులకు అనుగుణంగా రూ. లక్షతో సమాధి కట్టించుకున్నా. 20 సంవత్సరాల క్రితమే సమాధి నిర్మించుకుని.. చావు కోసం ఎదురుచూస్తున్నా. సంతోషంగా మరణించాలని అనుకుంటున్నా.'' - పొన్నగంటి వెంకటయ్య, సమాధి నిర్మించుకున్న వ్యక్తి, కడప
ఇదీ చదవండి:
cm jagan: నా ప్రతి ఆలోచనలో నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది