మూడు దశాబ్దాలకు పైగా ఆ తల్లి కుటుంబానికి దూరంగా ఉంది. భర్తతో మనస్పర్థలు రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నా అన్న వాళ్లకు కనిపించకుండా జీవనం సాగించేది. వయస్సు మీద పడటంతో తన వాళ్లను చూడాలనే ఆశ కలిగింది. ఎలాగైనా వారిని చేరుకోవాలని సంకల్పించుకుంది. అటుగా ప్రయత్నం చేసింది. ఆ మాతృమూర్తికి సహాయంగా నిలిచాడు ఓ కానిస్టేబుల్. ఆమెను సొంతిటికి చేర్చాడు. చనిపోయి ఉంటుందని అనుకున్న తల్లి తిరిగి ఇంటిని చేరటంతో ఆనందంతో మురిసిపోయారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు విజయనగరం వీధికి చెందిన ఉట్టి ఆంజనేయులు, పద్మావతి దంపతులకు 1962లో వివాహం అయింది. వారికి కుమారుడు ఉట్టి నాగశయనం, కుమార్తెలు నాగరత్న, నాగమణి, అరుణలు అనే నలుగురు సంతానం ఉన్నారు. పదేళ్ల క్రితం ఆంజనేయులు చనిపోయారు. 1987లోనే భర్తతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎవరికీ కనిపించకుండా రాజమహేంద్రవరంలోని లాలా చెరువులో ఉండేది. అక్కడే భవన నిర్మాణ పనులు చేసుకొని జీవించేది. అయితే కొద్ది నెలలుగా తన వారిని చూడాలని ఆమె ఆరాటపడుతుండేది.
విషయం తెలుసుకున్న ఓ కానిస్టేబుల్ పద్మావతి వివరాలను , చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో ఏడాది క్రితం పొందుపరిచారు. అయితే ఈ విషయం అప్పట్లో కుటుంబ సభ్యులకు తెలియలేదు. మూడు రోజుల క్రితం ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకున్న ఆమె కొడుకు... రాజమహేంద్రవరం వెళ్లి తన తల్లిని కలిశారు. అనంతరం పోలీసులు ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన తన పద్మావతి కోసం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వెతికామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్ల పాటూ వెతికినా ఫలితం లేకపోవటంతో చనిపోయి ఉంటుందని భావించారు. కానీ 32 ఏళ్ల తర్వాత బతికి ఉందని తెలియడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేవు. తల్లిని చూడగానే కుమారుడు నాగశయనం కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె రాకతో ఆ ఇంట సందడి నెలకొంది. పిల్లల వద్దకు చేరుకున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని పద్మావతి అన్నారు . సహాయం అందించిన పోలీసులకు పద్మావతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండీ...అభిమానమంటే బ్యానర్లే కాదు.. ఇలా సేవ చేయడం కూడా!