ముక్కుపచ్చలారని ఓ బాలికపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలో నివసించే ఓ దంపతులు చిన్నపాటి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి చెందిన మేక పిల్ల గురువారం చనిపోయింది. కళేబరాన్ని పారవేయడానికి వీరి కుమార్తె (8) ఊరిబయట ఉన్న కంప చెట్ల వైపు వెళ్లింది.
ఆ సమయంలో బాలికను అనుసరించిన ఓ బాలుడు (16) దానిని ఇక్కడ పడేస్తే దుర్వాసన వస్తుందని, ఇంకొంచెం దూరం వెళ్లి పడేయాలని చెప్పి మరింత దూరం తీసుకెళ్లాడు. అక్కడ బాలిక అరవకుండా దుస్తులు ఊడదీసి నోట్లోకి కుక్కాడు. ఆపై అత్యాచారం చేశాడు. బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె అత్త ఘటనాస్థలానికి వెళ్లింది. ఆమెను చూసిన నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే ఆమె తన మేనకోడలిని ఇంటికి తీసుకెళ్లింది. అనంతరం బాలిక కడుపునొప్పి తాళలేకపోతుండడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఉదంతంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చక్రాయపేట ఎస్.ఐ.రఘురామ్ తెలిపారు.
ఇదీ చదవండి:
Illegal contact: వ్యక్తిని కొట్టి చంపిన కానిస్టేబుల్... వివాహేతర సంబంధమే కారణం!