రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. నగర పాలక సంస్థ వైకాపా వశమైంది. మొత్తం 57 డివిజన్లలో 1 ఏకగ్రీవం కాగా.. 56చోట్ల ఎన్నికలు జరిగాయి. 11 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగటం, రాజధాని తరలింపు అంశం నేపథ్యంలో ఇక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఓటర్లు వైకాపాకి పట్టం కట్టారు. ఎన్నికలు జరిగిన 56 డివిజన్లలో 43స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంతో కలిపి అభ్యర్థులు 44చోట్ల వైకాపా విజయం సాధించినట్లయింది.
ఆ పార్టీ తరపున మేయర్ అభ్యర్థులుగా రేసులో ఉన్న కావటి మనోహర్ నాయుడు 20వ డివిజన్లో, పాదర్తి రమేష్ గాంధీ 6వ డివిజన్లో గెలుపొందారు. వైకాపా ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమకు విజయం కట్టబెట్టాయని అభ్యర్థులు చెబుతున్నారు. మేయర్ పదవి తనకు, మనోహర్ నాయుడుకు చెరో రెండున్నరేళ్లు కేటాయిస్తామని పార్టీ పెద్దలు చెప్పినట్లు రమేష్ గాంధీ తెలిపారు. డివిజన్లో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వైకాపా గెలుపొందటంతో నగరంలో సంబరాలు మిన్నంటాయి. ఆ పార్టీ మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. బాణసంచా కాల్చారు.
ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెదేపాకు ఫలితాలు నిరాశ కలిగించాయి. 9చోట్ల మాత్రమే పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెదేపా మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర 37వ డివిజన్లో విజయం సాధించారు. తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు తెదేపా కార్పొరేటర్లు ధన్యవాదాలు తెలిపారు. వారి నమ్మకం వమ్ము చేయకుండా డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. జనసేన రెండుచోట్ల, స్వతంత్రులు రెండు డివిజన్లలో విజయం సాధించారు. వైకాపాలో తనకు టికెట్ దక్కకపోయినా తన డివిజన్ ప్రజలు ఎంతో విశ్వాసంతో గెలిపించారని స్వతంత్ర అభ్యర్థి గురవయ్య తెలిపారు. ప్రజలతో మాట్లాడి స్వతంత్రంగా ఉండాలా... మళ్లీ అధికార పార్టీలోకి వెళ్లాలా అనేది నిర్ణయించుకుంటానని తెలిపారు.
కార్పొరేషన్లో ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే లక్ష్యంతో వైకాపా పనిచేసింది. మేయర్ పీఠానికి సరిపడా మెజార్టీ లేకపోతే ఎక్స్ అఫిషియో ఓట్లతోనైనా దక్కించుకోవాలని భావించింది. కానీ ఆ అవసరం లేకుండా పోయింది. స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తెదేపాలో ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదల కనిపించలేదు. కేసుల భయంతో చాలామంది వెనక్కి తగ్గారు. పార్టీకి పట్టున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇది కూడా తెదేపాకు పూర్తి వ్యతిరేక ఫలితాలకు కారణమైంది.
ఇదీ చదవండీ... విజయవాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో గందరగోళం