ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ - సుకుమా సరిహద్దు గ్రామమైన జోనాగుడా వద్ద జరిగిన మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో.. రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు మరణించారు. విజయనగరం జిల్లాకు చెందిన జగదీశ్(27), గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ(32)గా గుర్తించారు.
తిరిగిరాని లోకాలకు....
‘రెండు, మూడు రోజుల్లో వచ్చేస్తా. కంగారు పడొద్ధు. నేనిక్కడ క్షేమంగానే ఉన్నా’ అంటూ తల్లిదండ్రులకు సమాచారం అందించిన ఆ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. విధి నిర్వహణలో జరిగిన పోరాటంలో అసువులుబాశాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ అటవీ ప్రాంతంలో జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో విజయనగరం పట్టణం గాజులరేగ ప్రాంతానికి చెందిన రౌతు జగదీష్(27) దుర్మరణం చెందారు. జగదీష్ కుటుంబం ఏళ్లుగా గాజులరేగలోనే నివాసం ఉంటోంది. వీరి పూర్వీకులు మక్కువ మండలం కంచేడువలస గ్రామానికి చెందిన వారు. దీంతో రెండు ప్రాంతాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
నాన్న తెచ్చిన పుస్తకాలే చదివి: జగదీష్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి సింహాచలం పట్టణంలోని ఓ పుస్తకాల దుకాణంలో పనిచేస్తున్నారు. తల్లి రమణమ్మ గృహిణి. చెల్లెలకు మూడేళ్ల కిందట వివాహమైంది. బీఎస్సీ చదివిన జగదీష్ ఎప్పటికైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలనే తపనతో ఓవైపు చదువుతూనే మరోవైపు మైదానాల్లో పరుగులు తీసేవాడు. తండ్రి అప్పుడప్పుడూ తెచ్చిన పుస్తకాలను చదివేవాడు. ఈక్రమంలో 2014లో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగం సాధించాడు. కుటుంబానికి అండగా, వెన్నుదన్నుగా ఉంటాడనుకుంటే ఇలా అర్ధంతరంగా వెళ్లిపోయాడని తల్లిదండ్రులు బోరుమంటున్నారు.
ఉన్నతాధికారులను రక్షించే సమయంలో: సీఆర్‌పీఎఫ్ కోబ్రా దళం-210 బ్యాచ్‌కు చెందిన జగదీష్ గతంలో పలుమార్లు కూంబింగ్‌లో పాల్గొన్నాడు. మూడు నెలల కిందట విధుల్లో పాల్గొన్నాడు. ఈక్రమంలో విధి నిర్వహణలో భాగంగా తోటి జవాన్లతో కలిసి బీజాపూర్‌లో అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కాల్పులు జరుగుతుండగా తన ఉన్నతాధికారి వైపు, ముగ్గురు జవాన్ల వైపు మావోయిస్టులు దూసుకు వస్తూ కాల్పులు జరుపుతుండటంతో తన సహచరులను రక్షించే సమయంలో వారిని వెనక్కి నెట్టి ఎదురెళ్లాడు. దీంతో అక్కడికక్కడే వీర మరణం పొందాడు.
జగదీష్‌కు మే 12న వివాహం కావాల్సి ఉంది.పెళ్లి పనులు చూడాలని.. కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తుండగా రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. ఇంతలోనే ఈ విషాదం నెలకొంది. అందరితో సరదాగా ఉండే జగదీష్‌కు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. ఖాళీగా ఉంటే సరదాగా క్రికెట్ ఆడేవాడు. కొంతమంది యువతతో కలిసి సేవా కార్యక్రమాలకు ఇటీవల శ్రీకారం చుట్టాడు. 49వ వార్డు డివిజన్ కార్పొరేటర్ కర్రోతు రాధామణి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్సింగరావు తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్థివదేహం సోమవారం ఉదయం చేరుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఇంటివాడు కావాలని భావిస్తున్న వేళ.. అసువులు బాసి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన దాడిలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ(32) వీరమరణం పొందారు. ఆదివారం రాత్రి ఈ సమాచారం తెలియడంతో కుటుంబసభ్యులు, స్నేహితులు హతాశులయ్యారు. శాఖమూరి విజయకుమారి, రవీంద్రబాబు దంపతుల రెండో సంతానమైన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా-210 విభాగంలో ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వహిస్తూ మావోయిస్టుల ఘాతుకానికి విగత జీవిగా మారారు. త్వరలోనే ఆయనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావిస్తుండగా జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని కలచివేసింది.
ఇదీ చదవండి: