TDR Bonds Scam: పుర, నగర పాలక సంస్థలు జారీ చేసే బదిలీకి వీలున్న హక్కు పత్రాలు (టీడీఆర్ బాండ్లు) కొనుక్కోవచ్చని చెప్పిన ప్రభుత్వమే వాటి వినియోగాన్ని నిలిపివేయడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్ బాండ్లలో ఇప్పటివరకు వినియోగించుకోని వాటిని పురపాలకశాఖ తాజాగా బ్లాక్ చేసింది. కొనుగోలు చేసిన పలువురు ఇళ్లు, అపార్టుమెంట్లలో అదనపు అంతస్తులు వేసుకోవడానికి అనుమతుల కోసం పట్టణ, గ్రామీణ ప్రణాళిక విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దశలో బాండ్లను వెబ్‌సైట్‌లో బ్లాక్ చేయడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇలా తణుకులో కోట్ల విలువైన దాదాపు 650 బాండ్ల వినియోగంపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారంతా కొన్నవారిలో ఉన్నారు. సామాజిక అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించే స్థలాలకు పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసే టీడీఆర్ బాండ్లను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా కొని అదనపు ఫ్లోర్లు వేసుకోవచ్చు. కొనుగోలు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. ఇలా తణుకు పురపాలక సంఘం జారీ చేసిన టీడీఆర్ బాండ్లను వివిధ ప్రాంతాలవారు కొన్నారు. పలువురు అదనపు ఫ్లోర్లు వేసుకున్నారు. మిగిలినవారు వినియోగించుకోడానికి సమాయత్తమవుతున్న దశలో ప్రభుత్వం వీటిని బ్లాక్ చేసింది. దీంతో అదనపు ఫ్లోర్లు వేసేందుకు, విక్రయించేందుకూ వీల్లేకపోయింది.
ప్రభుత్వ అనుమతి తప్పనిసరి: బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణం, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, ఇతర అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించే స్థలాలకు 1:4 నిష్పత్తిలో ఇచ్చే టీడీఆర్ బాండ్లకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తణుకు పురపాలక సంఘంలో ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇదే నిష్పత్తిలో బాండ్లు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండి: వైకాపా పాలకులకు కూల్చడం తప్ప, కట్టడం రాదు: చంద్రబాబు