ప్రయాణికుల అవసరాల దృష్ట్యా గుంటూరు జంక్షన్ నుంచి కొత్తగా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని సర్వీసులను రద్దు చేసిన రైల్వే... కేవలం ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుపుతోంది. ఈ క్రమంలో గుంటూరు నుంచి రాయఘడ్ వరకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 27 నుంచి ప్రత్యేక రైలు సర్వీసు ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. గుంటూరులో రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యే రైలు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం మీదుగా రాయఘడ్ చేరుకోనుంది.
ఇక గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 26వ తేదిన ఈ రైలు ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7.45 గంటలకు ప్రారంభమై... మధ్యాహ్నం 2.25కు గుంటూరు స్టేషన్ చేరుకుంటుంది. అదే రైలు గుంటూరు నుంచి మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమై రాత్రి 9.50 గంటలకు సికింద్రాబాద్ కు వెళ్తుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ, ఖమ్మం, వరంగల్, ఖాజీపేట మీదుగా సికింద్రాబాద్ వరకు ఈ సర్వీసు నడవనుంది.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లా కలెక్టర్, మాచర్ల సీఐపై ఎస్ఈసీ చర్యలకు కారణాలేంటి?