ఆరోగ్య సమస్యల్లో ప్రజలను అత్యంత ఎక్కువగా భయపెట్టేది గుండెపోటు.. ఆ తర్వాత క్యాన్సర్ వంటి ఇతర రోగాలు ఉండేవి. కానీ.. గడిచిన రెండు దశాబ్దాల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు విపరీతంగా పెరిగి రెండో స్థానానికి చేరుకున్నట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి నిమిషానికి ఇద్దరు చొప్పున పక్షవాతం బారిన పడుతున్నారు. దేశంలో ఏటా 18 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్(brain stroke cases) బారిన పడి మృతి చెందడమో లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీపీ, షుగర్, కొలస్టరాల్ వంటి లక్షణాలతో ఎక్కువ మంది పక్షవాతం బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో వ్యాధి తీవ్రత పెరుగుతోంది.
మహిళల కన్నా పురుషుల్లోనే వ్యాధి రిస్కు శాతం ఎక్కువ. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల లోపు వారిని కూడా పక్షవాతం వెంటాడుతోంది. పక్షవాతానికి గురైన వ్యక్తిని 4 గంటలలోపే ఆస్పత్రిలో చేర్చడం ద్వారా ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
పక్షవాతానికి అనేక కారణాలుండగా ఇటీవల ఆ జాబితాలో కరోనా కూడా వచ్చి చేరింది. బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో రక్తనాళాలు చిట్లి కొందరు పక్షవాతానికి గురైతే.. రక్తనాళాలు మూసుకుపోయి మరికొందరు ఆ వ్యాధి బారిన పడుతున్నారు. ఒకసారి వస్తే రెండోసారి కూడా వచ్చే అవకాశాలున్నందున ఆహారం, మందులు విషయంలో జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణకు ప్రభుత్వపరంగా చర్యలతోపాటు ప్రజల్లోనూ అవగాహన పెరగాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి..
WEATHER REPORT: రాగల 24 గంటల్లో.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు