Irlapadu Youth: కరోనా సమయంలో ఒకరినొకరు కలుసుకునేందుకు భయపడే దశలో ఆ ఊరి యువకులు ధైర్యంతో ముందడుగు వేశారు. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూ, ఖాళీ సమయాన్ని పల్లె అభివృద్ధికి వినియోగించారు. సొంతూరి బాగు కోసం ఓ బృందంగా ఏర్పడ్డారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.
గుంటూరు జిల్లా ఇర్లపాడుకు చెందిన యువకులు ఉన్నత చదువులు చదివి...హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కరోనా ప్రభావంతో కంపెనీలు వర్క్‌ఫ్రం ఇవ్వడంతో అంతా సొంతూరికి వచ్చారు. ఊళ్లో పచ్చదనం లోపించడం, అపరిశుభ్ర వాతావరణం, ఇతర అసౌకర్యాలను గమనించారు. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో ఈ సమస్యలపై దృష్టిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ముందుగా మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చగా మార్చారు. తర్వాత పరిశుభ్రతతో పాటు నీటి వనరుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న బావుల్లో పూడిక తీసి శుభ్రంచేశారు. మరమ్మతులకు నోచుకోని వీధిలైట్లను బాగు చేయించి వెలుగులు నింపారు. కరోనా నివారణకు సంబంధించి మైకుల్లో అవగాహన కల్పించడంతోపాటు ఓ కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో వైరస్ సోకిన వారికి కావాల్సిన వస్తువులు, మందులను అందించారు.
యువకుల ప్రయత్నాన్ని చూసిన గ్రామస్థులు మేము సైతం అంటూ చేయి కలిపారు. అందరి సహకారంతో బ్యాంకులో ఓ ఖాతా తెరిచి, సేకరించిన సొమ్మును అందులో వేసి ఊరి అభివృద్ధికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. కేవలం తమ కోసం తాము కాకుండా సామాజిక బాధ్యతతో ముందడుగు వేస్తున్న ఇర్లపాడు యువకులు ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి: TDP on Jagan: 'ఆ ఫలితాలతో.. జగన్ రెడ్డికి మరింత భయం'