గుంటూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. ఇది గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని బ్రాడీపేట ప్రాంతం. ఇక్కడ పైవంతెన నిర్మించి 64 సంవత్సరాలైంది. అప్పటి ట్రాఫిక్‌కు తగ్గట్లుగా నిర్మించిన వంతెన..... ప్రస్తుత అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతుంది. గుంటూరు పాత, కొత్త నగరాల్ని కలిపే కీలకమైన ఈ వంతెన కేవలం రెండు వరుసలు మాత్రమే ఉండటంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయంగా కలెక్టరేట్ వంతెన ఉన్నప్పటికీ అది చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావటంతో ఈ మార్గానికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. పైగా అమరావతి రోడ్డు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గమంతా ఇటువైపుగానే ఉండటంతో బ్రాడిపేట పైవంతెనను విస్తరించటం లేదా కొత్తది నిర్మించాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. గతంలోనూ రెండు, మూడు సార్లు సర్వేలు జరిగినా ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఉన్న పైవంతెనను కూల్చి అక్కడ కొత్తది నిర్మిస్తారా లేక దీన్నే విస్తరిస్తారా అన్న విషయంలో స్పష్టత లేదు. వంతెన కాలపరిమితి దాటుతున్న తరుణంలో ఇప్పటికైనా దీని గురించి ఆలోచించాలని నగరవాసులు కోరుతున్నారు.
త్వరగా వెళ్లాలని వస్తే.. మరింత ఆలస్యం
గుంటూరు నుంచి విజయవాడ వెళ్లేవారు జాతీయ రహదారిపైకి సులువుగా చేరుకునేందుకు ఆరేళ్ల క్రితం ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారు. ఈ మార్గంలో రెడ్డిపాలెం వద్ద రైల్వే గేట్ ఉంది. ఇక్కడ తరచుగా గేట్ పడుతుండటంతో వాహనదారులు ఆగిపోవాల్సి వస్తుంది. ఆర్టీసీ బస్టాండ్ మీదుగా వెళ్లాలంటే నగరంలోని ట్రాఫిక్ మొత్తాన్ని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. త్వరగా వెళ్లాలని రింగు రోడ్డులోకి వచ్చినప్పుడు ఇక్కడ గేట్ పడితే మరింత ఆలస్యమవుతోంది. ఇక శ్యామలనగర్‌లోని రైల్వే గేట్ వద్ద కూడా సమస్యలు తప్పటం లేదు. ఇక్కడ పైవంతెన లేదా అండర్‌పాస్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
కేంద్రమంత్రి ఆమోదం
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా... పైవంతెనల ప్రతిపాదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి అధికారుల బృందాన్ని పంపారు. గుంటూరు నగరంలో మూడు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి ట్రాఫిక్ కష్టాలను స్వయంగా చూసింది. మూడు ప్రాంతాల్లోనూ.... పైవంతెనల నిర్మాణం అత్యవసరమని అభిప్రాయపడింది. వెంటనే సర్వే పనులు చేపట్టాలని సూచించి వెళ్లారు.
ఇదీ చదవండి : 3 కిమీ మేర స్తంభించిన ట్రాఫిక్- వాహనదారుల ఇక్కట్లు